టీమిండియా చరిత్ర సృష్టించింది. టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్‌లలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. వన్డేల్లో మళ్లీ ఆగ్ర పీఠాన్ని అధిరోహించింది.
ఇటీవల ఆసియా కప్ గెలిచిన సంబరం మరువకముందే.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అన్ని ఫార్మాట్లలో భారత్ టాపర్‌గా నిలిచింది. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించడమే కాకుండా.. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 116 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సాధించగా.. పాకిస్థాన్ (115), ఆస్ట్రేలియా (111) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసీస్‌తో సిరీస్‌ను నెగ్గితే వరల్డ్ కప్‌నకు అగ్రస్థానంతో బరిలోకి దిగే అవకాశం భారత్‌కు ఉంటుంది.
అన్ని ఫార్మాట్లలో ఏకకాలంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు 2012 దక్షిణాఫ్రికా ఈ అరుదైన ఘనత సాధించింది. ఇక భారత్ టాప్ ర్యాంక్‌లో ఉండగా.. పాకిస్తాన్(115), ఆస్ట్రేలియా(111) రేటింగ్‌తో వరుసగా రెండు, మూడు స్ధానాల్లో కొనసాగుతున్నాయి.
ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు.
అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో జంపా రెండు వికెట్లు.. కమ్మిన్స్, అబాట్ తలా వికెట్ పడగొట్టారు.