Kids

4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం

4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం

గత తొమ్మిదేళ్ల వ్యవధిలో 4.46 లక్షలమంది తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగొన్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. వారిలో 3.97 లక్షల మందిని వారి కుటుంబాల వద్దకు చేర్చినట్లు చెప్పారు. తప్పిపోయిన చిన్నారుల కోసం 2015లో మహిళా, శిశు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘ఖోయా- పాయా పోర్టల్’ ద్వారా ఇది సాధ్యమైందన్నారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్మృతి ఇరానీ ప్రసంగించారు. 2009-10 ప్రభుత్వ బడ్జెట్‌లో శిశు సంక్షేమానికి రూ.60 కోట్లు కేటాయించగా.. గతేడాది నాటికి ఇది రూ.14,172 కోట్లకు పెరిగిందని ఇరానీ చెప్పారు.

‘2015 నుంచి దాదాపు 4.46 లక్షల మంది తప్పిపోయిన చిన్నారులను గుర్తించాం. వారిలో 3.97 లక్షల మంది పిల్లలను విజయవంతంగా వారి కుటుంబాల వద్దకు చేర్చామని చెప్పేందుకు గర్వపడుతున్నాం’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. 2021లో జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లో సవరణ ద్వారా చిన్నారుల దత్తత బాధ్యతలను కోర్టులకు బదులుగా జిల్లా మేజిస్ట్రేట్‌లకు అప్పగించామని.. ఈ క్రమంలోనే 2,600 మంది పిల్లలను ఆయా కుటుంబాలు దత్తత తీసుకున్నాయని చెప్పారు. 2014 నుంచి చిన్నారుల సంరక్షణ కేంద్రాల ద్వారా.. ఏడు లక్షల మంది పిల్లలకు సాయం అందించామని తెలిపారు.