ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్‌పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ NIA.. భారత్‌లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది.
తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో..
NIA దర్యాప్తులో.. అమృత్‌సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్‌ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్‌ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది.
కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్‌ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్‌నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్‌పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు.