Politics

ముఖ్యమంత్రికి ‘విశాఖ వందనం’ పేరుతో భారీగా స్వాగతం

ముఖ్యమంత్రికి ‘విశాఖ వందనం’ పేరుతో భారీగా స్వాగతం

విజయదశమి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నుంచి పరిపాలించాలని తీసుకున్న నిర్ణయాన్ని నాన్‌ పొలిటికల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ స్వాగతించింది. విశాఖకు తరలిరానున్న ముఖ్యమంత్రికి ‘విశాఖ వందనం’ పేరుతో భారీగా స్వాగతం పలకాలని జేఏసీ నిర్ణయించింది. మూడు రాజధానుల అంశంపై న్యాయస్థానంలో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని జేఏసీ తీర్మానం చేసింది.

సర్క్యూట్‌ హౌస్‌లో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌ నేతృత్వంలో శనివారం జరిగిన సమీక్షలో వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో సహా పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగున్నరేళ్ల నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరిట ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి వృథా ఖర్చులు చేసిందన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతిలో రాజధాని నిర్మించాలనుకున్నారని, అదీ సాధ్యం కాకపోవడంతో ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని చెప్పారు. మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ విశాఖకు రాజధానిని తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులున్నా.. సీఎం రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అయినా పాలన సాగించవచ్చన్న భావనతో విశాఖ వైపు అడుగులేస్తున్నారని చెప్పారు.