అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు.
సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు.