DailyDose

వల్లూరు-చెన్నూరు మండలాల సరిహద్దులో వజ్రాల వేట

వల్లూరు-చెన్నూరు మండలాల సరిహద్దులో వజ్రాల వేట

వల్లూరు-చెన్నూరు మండలాల సరిహద్దులోని పుష్పగిరి కొండపై కొన్ని రోజులుగా వజ్రాలఅన్వేషణ సాగుతోంది. అదృష్టం వరిస్తే కష్టాలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో పలువురు దూర ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. వర్షం కురిసిన మరుసటి రోజుల్లో చెన్నూరు, ఖాజీపేట, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, మైదుకూరు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు కూలీలతో పుష్పగిరి గుట్టంతా శోధిస్తుండడం గమనార్హం.

2017లోనే తవ్వకాలు: చెన్నూరు మండల పరిధిలోని ఓబులంపల్లె గ్రామ పరిధిలోని పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో అయిదేళ్ల కిందట వజ్రాల కోసం ఇదే ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు తవ్వకాలు చేపట్టారు. జియోగ్రాఫికల్‌ సర్వే ద్వారా ఆ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఆ మట్టి, ధాతువులు, ఖనిజాలను సేకరించిన మొత్తాన్ని రైలు బోగీలకు నింపి అనంతపురంలోని రామగిరి ప్రాంతంలోని ప్రయోగశాలకు తరలించారు. అనంతరం రెండేళ్ల కిందట హెలీకాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే కూడా చేశారు. మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామ సమీపంలో వజ్రాలు నిక్షిప్తమై ఉన్నాయని గుర్తించి వాటిని శోధించి వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళుతున్నాయనే వదంతులు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.