ఇందౌర్ వేదికగా ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య (IND vs AUS) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
కీలక ఆటగాళ్లు లేకపోయినా సమష్టిగా రాణించి.. బలమైన ఆసీస్‌ను ఓడించారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి గెలిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లోనూ భారత్ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరింది. 50 ఓవర్ల క్రికెట్‌లో ఇబ్బందిపడిన సూర్య మళ్లీ ఫామ్ అందుకొన్నట్లే కనిపించాడు. బ్యాటింగ్‌లో ఒకరు.. బౌలింగ్‌లో ఒకరు మినహా మిగతావారు రాణించారు. వరల్డ్ కప్ ముంగిట ఆ ఇద్దరి విషయంలోనే మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది.
ఈ పేస్ ఆల్‌రౌండర్ పరిస్థితేంటో?
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై షమీ, బుమ్రా, అశ్విన్, జడేజా రాణించారు. షమీ ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్ చేశాడు. అయితే, ఒకే ఒక్క బౌలర్ మాత్రం భారీగా పరుగులు సమర్పించాడు. అతడే శార్దూల్ ఠాకూర్. ఆసీస్‌పై తొలి వన్డేలో వికెట్ తీయకుండా 78 పరుగులు సమర్పించాడు. హార్దిక్ పాండ్యతోపాటు పేస్ ఆల్‌రౌండర్‌గా అక్కరకొస్తాడని భావించినా.. ‘లార్డ్’ శార్దూల్ మాత్రం తనస్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. రెండోవన్డేలోనూ ఇదే ప్రదర్శన పునరావృతమైతే మాత్రం వరల్డ్ కప్ ఛాన్స్ చేజారే ప్రమాదం లేకపోలేదు. మూడో వన్డేలో హార్దిక్ రంగంలోకి దిగుతాడు. దీంతో శార్దూల్‌కు తుది జట్టులో స్థానం కష్టమే. వరల్డ్ కప్‌లో ఆడే పూర్తిస్థాయి జట్టు ఎలా ఉంటుందో.. మూడో వన్డేలో బరిలోకి దిగే టీమ్ కూడా దాదాపు అలాగే ఉండొచ్చని ఇప్పటికే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సిరీస్‌కు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అశ్విన్ ఈసారి కూడా..
దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి వచ్చినా సరే.. తనకేమీ కొత్త ఫార్మాట్ కాదన్నట్లుగా అశ్విన్ బౌలింగ్ ఉంది. పది ఓవర్ల కోటాను అలవోకగా పూర్తి చేసేశాడు. అందుకు కారణం కూడా టెస్టుల్లో రోజుల తరబడి బౌలింగ్ చేసిన అనుభవం అశ్విన్ సొంతం. తన పది ఓవర్ల కోటాలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన అశ్విన్ కీలకమైన లబుషేన్ వికెట్‌ను తీశాడు. దీంతో అక్షర్ పటేల్ లేని లోటును తీర్చేసినట్లే. ఆసీస్‌తో చివరి వన్డే నాటికి అక్షర్ పటేల్ కోలుకుని వచ్చి జట్టుతోపాటు చేరితేనే ప్రపంచకప్ స్క్వాడ్‌లో కొనసాగుతాడు. ఒకవేళ గాయం నుంచి కోలుకోకపోతే మాత్రం అక్షర్ స్థానంలో అశ్విన్‌కు మేనేజ్‌మెంట్ చోటు కల్పించనుంది. అందుకే, ఆసీస్‌తో రెండో వన్డేలోనూ అశ్విన్ రాణిస్తే మరో ఆప్షన్ వైపు చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రేసులో ఉన్నాడు. కానీ, ఆసియా కప్ ఫైనల్‌తోపాటు ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు.
మ్యాచ్ షెడ్యూల్.. పిచ్ రిపోర్ట్
ఇందౌర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్‌ను అరగంట ముందు వేస్తారు. జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తోపాటు స్పోర్ట్స్ 18 ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించొచ్చు. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువే. అయినా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా ఇందౌర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బౌండరీ లైన్లు కూడా చిన్నవే. దీంతో స్పిన్నర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. టాస్ గెలిచే జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
తుది జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/సిరాజ్, అశ్విన్, షమీ, బుమ్రా