దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా రెండోవారమూ తగ్గాయి. సెప్టెంబర్ 7తో ముగిసిన వారంలో ఇవి 867 మిలియన్ డాలర్ల మేర తగ్గి 593.037 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయినట్టు రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అంతక్రితం వారంలో ఫారెక్స్ నిల్వలు భారీగా 4.99 బిలియన్ డాలర్లు క్షీణించి 593.90 బిలియన్ డాలర్ల వద్దకు తగ్గాయి. 2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన తర్వాత మళ్లీ ఆ స్థాయికి నిల్వలు కోలుకోలేదు.
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్‌బ్యాంక్ పదేపదే డాలర్లను విక్రయించడంతో ఫారెక్స్ నిల్వల్లో తరుగు ఏర్పడిందని డీలర్లు తెలిపారు. సెప్టెంబర్ 15తో ముగిసిన వారంలో విదేశీ నిల్వల్లో అధికభాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 511 మిలియన్ డాలర్లు తగ్గి 525.915 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ మారకంలో వెల్లడించే విదేశీ కరెన్సీ ఆస్తుల్లో..అమెరికాయేతర కరెన్సీలయిన యూరో, పౌండ్, యెన్‌ల విలువల్లో ఏర్పడిన పెరుగుదల లేదా తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు.
బంగారం నిల్వల్లోనూ తరుగు
సమీక్షా వారంలో రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న బంగారం నిల్వలు సైతం తరిగిపోయాయి. ఇవి 384 మిలియన్ డాలర్ల మేర క్షీణించి 44 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 32 మిలియన్ డాలర్లు పెరిగి 18.092 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్ద ఉంచిన రిజర్వుల విలువ 4 మిలియన్ డాలర్లు తగ్గి 5.03 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.