DailyDoseDevotional

టీటీడీకి ప్రకృతి ఉత్పత్తులకు మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు

టీటీడీకి ప్రకృతి ఉత్పత్తులకు మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు

శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నిమిత్తం టీటీడీకి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 10 రకాల ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1,784 టన్నుల శనగలు, బెల్లం సరఫరా చేయగా.. ఈ సీజన్‌ నుంచి బియ్యంతో పాటు కందులు, పెసలు, మినుములు, పసుపు, వేరుశనగ, ఆవాలు, కొత్తిమీర సరఫరా చేయబోతోంది.

ప్రీమియం ధర చెల్లింపు
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కంటే 10–15 శాతం అదనపు ధరతో రైతుల నుంచి సేకరించి సరఫరా చేయబోతున్నారు. మార్కెట్‌ ధర ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎమ్మెస్పీ కంటే 10 శాతం అదనంగా.. ఎమ్మెస్పీ కంటే మార్కెట్‌ ధర ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్‌ ధర కంటే 15 శాతం అదనంగా ప్రీమియం ధర చెల్లించేలా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను సీఎం యాప్‌ ద్వారా ఎన్‌రోల్‌ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రీమియం ధర చెల్లించి పంట ఉత్పత్తులను సేకరిస్తున్నారు.
శనగలు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 2021–22 సీజన్‌లో రూ.5,230 ఉండగా.. రైతుల నుంచి రూ.5,753 చొప్పున చెల్లించి సేకరించారు. 2022–23 సీజన్‌లో కనీస మద్దతు ధర రూ.5,335 కాగా, రైతులకు రూ.5,868 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు. బెల్లం మార్కెట్‌ ధర క్వింటాల్‌ రూ.5,250 కాగా.. రైతుల నుంచి రూ.6,037 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు.

రూ.5 కోట్లతో నంద్యాలలో దాల్‌ మిల్‌
ఆర్బీకేల ద్వారా సేకరించిన పంట ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్థారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు లిమిటెడ్‌(ఎన్‌ఏబీఎల్‌) గుర్తింపు పొందిన థర్డ్‌ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రసాయన అవశేషాలు లేని ఫైన్‌ క్వాలిటీ (ఎఫ్‌ఏక్యూ)ఉత్పత్తులని నిర్థారించుకున్న తర్వాతే ప్రాసెస్‌ చేసి టీటీడీకి సరఫరా చేస్తారు. మరోవైపు రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సొంతంగా ప్రాసెస్‌ చేసి సరఫరా చేసేందుకు నంద్యాలలో రూ.5 కోట్ల అంచనాతో దాల్‌ మిల్లును ఏర్పాటు చేస్తున్నారు.