Business

ఆధిపత్యానికి చెక్‌! రంగంలోకి ఫోన్‌పే..

ఆధిపత్యానికి చెక్‌! రంగంలోకి ఫోన్‌పే..

గూగుల్‌ (Google), యాపిల్‌ (Apple) ఆధిపత్యానికి చెక్‌ పెడుతూ మరో కొత్త యాప్‌ స్టోర్‌ రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్‌ కంపెనీ ఫోన్‌పే (PhonePe) తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్‌ల కోసం తెరుస్తోంది.

ఇండస్‌ యాప్‌స్టోర్‌ అనే పేరుతో మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫామ్‌లో తమ యాప్‌లను ప్రచురించడానికి ఆండ్రాయిడ్‌ యాప్ డెవలపర్‌లను ఆహ్వానిస్తోంది. ఈ యాప్‌స్టోర్‌లో యాప్‌లను ఉంచడానికి కానీ, డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కానీ ఎటువంటి రుసుము ఉండదని తెలుస్తోంది.

ఇండస్ యాప్‌స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ఫోన్‌పే ధ్రువీకరించింది. ప్లాట్‌ఫామ్‌లోని యాప్ లిస్టింగ్‌లు మొదటి సంవత్సరం ఉచితంగా ఉంటాయని, ఆ తర్వాత నామమాత్రపు వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు తెలిపింది.

ఇండస్‌ యాప్ స్టోర్‌లో డెవలపర్‌లు తమ యాప్‌లను ఇంగ్లిష్ కాకుండా మరో 12 భారతీయ భాషల్లో లిస్ట్‌ చేయవచ్చు. అలాగే ఆయా భాషల్లోని తమ యాప్ లిస్టింగ్‌లకు ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు.

యాప్‌లకు సంబంధించి తలెత్తే సమస్యల పరిష్కారానికి గూగుల్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ల లాగే ఇండస్‌ యాప్‌ స్టోర్‌ కూడా భారత్‌ కేంద్రంగా ఈ-మెయిల్ లేదా చాట్‌బాట్ ద్వారా 24×7 అంకితమైన సపోర్ట్‌ వ్యవస్థను అందిస్తున్నట్లు పేర్కొంది. యాప్‌స్టోర్‌ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ఇండస్‌ యాప్‌స్టోర్‌ తమ వైబ్‌సైట్‌లో ప్రచురించింది.