దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల గణనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని పునద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా కల్సించాలని అన్నారు. రాహుల్ శనివారం రాజస్తాన్‌లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు.
మహిళా రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యమేనని రాహుల్ స్పష్టం చేశారు. జనగణన, నియోజకవర్గాల పునరి్వభజన ముసుగులో ఈ రిజర్వేషన్లను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఓబీసీల గురించి నిత్యం మాట్లాడే ప్రధానమంత్రి కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. దయచేసి ఓబీసీలను మోసం చేయకండి అని కోరారు. కుల గణన గురించి పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రయతి్నస్తే బీజేపీ సభ్యులు తన గొంతుకను అణచివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ బబ్బర్ షేర్స్ (సింహాలు)గా అభివరి్ణంచారు. అదానీతో ప్రధాని మోదీ సంబంధాలను రాహుల్ మరోసారి ప్రస్తావించారు.