కొలంబియాలో స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి సుదీర్‌కుమార్ అలియాస్ జోషి (34) టెలీ కమ్యూనికేషన్‌లో ఎంఎస్ చేసేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో ఎంఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా చదువు పూర్తి కాకపోవడం, సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
తనతోపాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో సుదీర్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన తన స్నేహితురాలి జన్మదిన వేడుకల నిమిత్తం సుదీర్‌కుమార్ స్పెయిన్ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు. అక్కడి నుంచి రియో బ్లాంకోలోని స్నేహితురాలి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ జన్మదిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 19వ తేదీన మంగళవారం తెల్లవారుజామున కొలంబియాలోని జెస్సీకా నుంచి జి.కొండూరులోని సుదీర్‌కుమార్ తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్ మరణ వార్త అందింది.