Editorials

పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేయండి

పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేయండి

ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌కు భారత్‌ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌ దురాక్రమణలో ఉన్న కశ్మీర్‌లో భూభాగాలను ఖాళీ చేయాలని, పాక్‌ గడ్డపైనున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని గట్టిగా చెప్పింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 78వ సర్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్‌ ఉల్‌ హక్‌ కాకర్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్‌ గట్టిగా కౌంటర్‌ ఇచి్చంది.

భారత్‌తో పాకిస్తాన్‌ శాంతిని కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన జరగాలంటే కశ్మీర్‌ అంశమే కీలకమని కాకర్‌ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్‌ సెక్రటరీ అయిన పెటల్‌ గెహ్లోత్‌ ఈ సమావేశంలో మాట్లాడారు. కాకర్‌ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. భారత్‌పై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాక్‌కు ఒక అలవాటుగా మారిందని ఆమె అన్నారు.

పాకిస్తాన్‌లో మానవ హక్కుల హననం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చడానికే కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారని మండిపడ్డారు. ‘‘జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని మేము పదే పదే చెబుతున్నాం. మా అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాక్‌కు లేదు’’అని ఆమె గట్టిగా చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్‌ మూడు పనులు చేయాలని ఆమె సూచించారు.