Business

₹2.2 లక్షల కోట్లు ఆవిరి-వాణిజ్యం

₹2.2 లక్షల కోట్లు ఆవిరి-వాణిజ్యం

* గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థలు రూ.2,28,690 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.99,835.27 కోట్ల ఎం-క్యాప్ నష్టపోయింది. తర్వాతీ స్థానంలో రిలయన్స్ రూ.71,715.6 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. అయినా ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. టాప్-3లోనే కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలతో సరిపెట్టుకున్నాయి. టాప్-10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మాత్రమే లాభాలు పొందాయి. టీసీఎస్ రూ.1,024.53 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.2,913.49 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1829 పాయింట్లు (సుమారు 2.7శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 518 పాయింట్లు (దాదాపు 2.60 శాతం) నష్టాలతో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ దాదాపు ఎనిమిది శాతం, రిలయన్స్ షేర్ నాలుగు శాతానికి పైగా నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,412.17 కోట్లు నష్టపోయి రూ.6,65,432.34 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.12,964.55 కోట్లు కోల్పోయి రూ.5,10,759.01 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,744.34 కోట్ల పతనంతో రూ.6,20,893.53 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.6,484.52 కోట్ల నష్టంతో రూ.5,52,680.92 కోట్లతో సరిపెట్టుకున్నది.

* కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల (Vande Bharat Trains) సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్‌ల సంఖ్య 34కి చేరింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఒక రైలు కాషాయ రంగులో (కాసర్‌గోడ్‌-తిరువనంతపురం రూట్‌లో ఒకటి), మిగిలిన రైళ్లు నీలం రంగులో నడుపుతున్నారు. రాబోయే రెండు నెలల్లో మరో 9 కాషాయ రంగు వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా ప్రారంభించిన 9 రైళ్లలో కొన్ని ఫీచర్లను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. కొత్తగా ప్రారంభించిన వందే భారత్‌ కోచ్‌లలో సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ను 17.31 డిగ్రీల నుంచి 19.37 డిగ్రీలను పెంచారు. దానివల్ల ప్యాసింజర్లు తమ సీట్లను మరింత వెనక్కి జరిపి సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ప్రయాణికులు కూర్చునే సీట్ల కుషన్‌ గట్టిగా ఉందనే విమర్శల నేపథ్యంలో కొత్త కోచ్‌లలో మెత్తటి కుషన్‌లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ సీట్ల రంగును రెడ్‌ నుంచి బ్లూకు మార్చడంతోపాటు, ఫుట్‌రెస్ట్‌ను మరింత పొడిగించారు. కొత్తగా సీట్ల వెనుక మ్యాగజైన్‌ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం సీట్ల కింద ఏర్పాటు చేసిన ఛార్జింగ్‌ పాయింట్లను సులువుగా యాక్సెస్‌ చేసేలా వాటిలో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవే కాకుండా టాయిలెట్‌లో మెరుగైన లైటింగ్ కోసం 1.5 వాట్‌ బల్బుల స్థానంలో 2.5 వాట్‌ బల్బులను అమర్చారు. వాష్‌ బేషిన్‌లో చేతుల కడిగే సమయంలో నీళ్లు బేసిన్‌ నుంచి బయటికి రాకుండా వాటి సైజ్‌ను పెంచారు. ప్రయాణికుల సౌకర్యంగా ఉండేలా వాటర్‌ ట్యాప్‌లు, టాయిలెట్ హ్యాండిల్స్‌ను కొత్తగా డిజైన్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దివ్యాంగుల వీల్‌ఛైర్‌లను భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్ కోసం ఎయిర్‌టైట్‌ ప్యానల్స్‌లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాంతోపాటు లగేజ్‌ ర్యాక్‌ లైట్లకు గతంలో కంటే మరింత మృదువైన టచ్‌ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేశారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్‌ ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు.

* ప్రపంచ వాణిజ్యానికి ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ కారిడార్‌ దశాబ్దాలపాటు ఆధారంగా నిలుస్తుందని, చరిత్రలో దీన్ని గుర్తుచేసుకుంటారని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. మన్‌ కీ బాత్‌ (Mann ki Baat) కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై ప్రసంగించిన ప్రధాని.. దేశం గొప్ప వాణిజ్య శక్తిగా ఉన్నప్పుడు సిల్క్‌ రూట్‌ను ఉపయోగించదనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జీ20 సదస్సు సందర్భంగా ‘‘ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్ కారిడార్‌’’ను భారత్‌ సూచించిందని చెప్పారు. చంద్రయాన్‌-3 విజయం, జీ20 సదస్సు నిర్వహణ దేశంలో ప్రతి పౌరుడి ఆనందాన్ని రెట్టింపు చేశాయని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి తనకు వచ్చిన సందేశాల్లో ఎక్కువగా ఈ రెండింటి గురించే ప్రస్తావించినట్లు తెలిపారు.

* ఈ పండగ సీజన్‌ (Festival season)లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ కొనుగోళ్లలో విలువపరంగా 18- 20 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓనంతోనే దక్షిణాది మార్కెట్లలో కొనుగోళ్ల జోరు ప్రారంభమైందని పేర్కొన్నాయి. ఈసారి పండగ సీజన్‌ (Festival season)లోనే క్రికెట్‌ ప్రపంచ కప్‌ (World Cup 2023) కూడా రానుండడం మరో విశేషమని తెలిపాయి. దీనివల్ల కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నాయి. ప్రపంచ కప్‌ (World Cup 2023) నేపథ్యంలో టీవీలకు భారీ గిరాకీ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా పెద్ద తెరలు ఉండే టీవీల కొనుగోళ్లు భారీగా జరగొచ్చని తెలిపాయి. బ్యాటరీ ఆధారిత స్పీకర్లు, సౌండ్‌బార్లు, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లు, ఇయర్‌ బడ్స్‌కు కూడా మంచి గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. పాత టీవీలు, చిన్న తెరలు ఉన్న టీవీల స్థానంలో వినియోగదారులు పెద్ద తెరల టీవీలను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, పానాసోనిక్‌, థామ్సన్‌ వంటి కంపెనీలు తెలిపాయి. క్యూలెడ్‌, ఓలెడ్‌ టీవీ వేరియంట్లలో ప్రీమియం, అల్ట్రా ప్రీమియం టీవీలకు మంచి గిరాకీ ఉంటుందని పేర్కొన్నాయి. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు కొనసాగనున్న విషయం తెలిసిందే.

* చైనా(China)లో గృహ సంక్షోభం ఆందోళనకర స్థాయికి చేరుకొంది. ఇది ఎంతగా అంటే.. అక్కడ జనాభా కంటే ఇళ్లే అధికంగా ఉన్నాయంటున్నారు. లక్షల సంఖ్యలో ఖాళీ గృహాలు దర్శనమిచ్చే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని చైనాలోని ఓ మాజీ అధికారి వెల్లడించారు. ఒకప్పుడు చైనా(China)లో స్థిరాస్తి రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. కానీ, 2021లో ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంలో పడిన నాటి నుంచి ఈ రంగం తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. అనంతరం కంట్రీ గార్డెన్‌ హోల్డింగ్స్‌ వంటి సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆగస్టు చివరి నాటికి దేశంలో 700 కోట్ల చదరపుటడుగుల నిర్మాణాలు విక్రయం కాకుండా మిగిలిపోయాయని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడిస్తున్నాయి. ఒక్కో ఇంటిని సగటున 90 చదరపు మీటర్లు (970 ఎస్‌ఎఫ్‌టీ) లెక్కన చూస్తే ఇవి సుమారు 72 లక్షల ఇళ్లకు సమానం. వీటిల్లో ఇప్పటికే అమ్ముడుపోయినా.. నగదు సమస్య కారణంగా పూర్తికానివి, 2016లో స్పెక్యూలేషన్‌ పెరిగిన సమయంలో కొనుగోలు చేసి ఖాళీగా ఉన్న ప్రాజెక్టులను చేర్చలేదు. ఇక్కడ ఉన్న మొత్తం ఇళ్ల ఖాళీల విషయంలో నిపుణుల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఈ పరిస్థితిపై చైనా స్టాస్టిక్స్‌ బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్‌ హెకెంగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం చైనాలో ఉన్న ఇళ్లు 300 కోట్ల మంది నివసించడానికి సరిపోతాయని అభిప్రాయపడ్డారు. అతడు దక్షిణ చైనాలోని డాంగ్యూన్‌ నగరంలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

* యాపిల్‌ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్‌లను జారీ చేసింది. ఐఫోన్‌ (iPhone), ఐపాడ్‌ (iPad), యాపిల్‌ వాచ్‌ (Apple Watch), మ్యాక్‌బుక్‌ (MacBook)ల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (OS)తో పాటు సఫారీ బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) వెల్లడించింది. దీని వల్ల హ్యాకర్లు యాపిల్‌ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల సమాచారం సేకరించే అవకాశం ఉందని హెచ్చరించింది.

* విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్లు, టాబ్లెట్ల దిగుమ‌తిపై గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాల‌కు రిలీఫ్ క‌ల్పించింది. 2024 సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కూ వాటి దిగుమ‌తికి లైసెన్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఆపిల్‌, డెల్‌, ఇంటెల్‌, శాంసంగ్‌, అసుస్ వంటి సంస్థ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్లు, టాబ్లెట్ల దిగుమ‌తిపై నియంత్ర‌ణ కోసం విదేశీ వాణిజ్య డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ (డీజీఎఫ్‌టీ).. దిగుమ‌తి యాజ‌మాన్య వ్య‌వ‌స్థ అనే పేరుతో కొత్త పోర్ట‌ల్ డిజైన్ చేస్తున్న‌ది. విదేశాల నుంచి వ‌స్తువులు దిగుమ‌తి చేసుకునే కంపెనీలు త‌మ పేర్లు న‌మోదు చేసుకోవడంతోపాటు ఎప్ప‌టిక‌ప్పుడు దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల డేటా.. ఈ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేయాల్సి ఉంటుంది. 2024 సెప్టెంబ‌ర్ త‌ర్వాత ప‌రిస్థితుల‌ను కేంద్రం స‌మీక్షించ‌డంతోపాటు దిగుమ‌తి వ‌స్తువుల‌పై సుంకాలు త‌గ్గించే విష‌యాన్ని ప‌రిశీలిస్తుంది.