తిరుమలలోని తితిదే రవాణా కార్యాలయం నుంచి ధర్మరథాన్ని (ఎలక్ట్రిక్ బస్సు) ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తిరుమలలో భక్తులను ఉచితంగా తరలించేందుకు శ్రీవారి ధ]ర్మరథం పేరుతో తితిదే పది ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. వీటిని పగలు వినియోగించిన అనంతరం జీఎన్‌సీ టోల్‌గేట్‌కు సమీపంలోని తితిదే రవాణా కార్యాలయంలో ఉంచి రాత్రి ఛార్జింగ్ పెడతారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున 3.53 గంటల సమయంలో బస్సును దొంగిలించారు. ఉదయం రవాణా అధికారులు గుర్తించి తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ కెమెరాలు, బస్సులో ఏర్పాటు చేసిన జీపీఎస్ ద్వారా బస్సు నాయుడుపేట బిరుదవాడకు సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద రహదారిపై వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను పంపి బస్సును స్వాధీనం చేసుకున్నారు. రవాణా కార్యాలయం వద్ద తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడం, సరైన భద్రతా ప్రమాణాలను పాటించక పోవడంతోనే బస్సు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వారం కిందట తితిదేకు చెందిన ఓ ఎలక్ట్రిక్ కారును దుండగులు దొంగిలించారు. కడప సమీపంలోని ఒంటిమిట్ట ఆలయం వద్ద వాహనాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో తితిదే అధికారులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు దీనిపై కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకపోవడం గమనార్హం.
స్వామివారి విద్యుత్ బస్సు చోరీ
Related tags :