Editorials

తెరుచుకోని స్కార్పియో ఎయిర్‌బ్యాగులు. ఆనంద్ మహీంద్రపై కేసు.

తెరుచుకోని స్కార్పియో ఎయిర్‌బ్యాగులు. ఆనంద్ మహీంద్రపై కేసు.

దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ చైర్మన్ ‘ఆనంద్ మహీంద్రా’ మీద కాన్పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన ‘రాజేష్ మిశ్రా’ తన కుమారుడు మహీంద్రా కారులో ప్రయాణిస్తూ చనిపోవడంతో ఆనంద్ మహీంద్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్నానీతో పాటు కంపెనీలోని 11 మంది ఉద్యోగులపై కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం తన కొడుకు ‘మహీంద్రా స్కార్పియో’లో ప్రయాణించే సమయంలో సీటు బెల్టు ధరించి ఉన్నప్పటికీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడం వల్ల మరణించినట్లు వెల్లడించాడు. 2022 జనవరి 14న తన కొడుకు అపూర్వ్ లక్నో నుంచి కాన్పూర్‌కు తిరిగి వస్తున్న సమయంలో స్కార్పియో ప్రమాదానికి గురైనట్లు, ఈ సమయంలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లే మరణించాడని చెప్పుకొచ్చాడు. భద్రతలో స్టార్ రేటింగ్ కలిగిన కారులో ఎయిర్ బ్యాగులు ఎందుకు ఓపెన్ కాలేదని ఆరోపించాడు. ప్రమాదంలో కొడుకు మరణించిన 15 రోజుల తరువాత తాను కారు కొనుగోలు చేసిన డీలర్‌షిప్‌కి వెళ్లి సీటు బెల్టు పెట్టుకున్నా ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదని వాపోయాడు. ఈ సందర్భంగా ఉద్యోగులు, రాజేష్ మిశ్రా మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత వీరిపై కేసు నమోదు చేయించాడు. ఆరోపణల మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఆనంద్ మహీంద్రా ఇంకా స్పందించలేదు.