* దేశంలో విద్యుత్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే దేశవ్యాప్తంగా 10లక్షలకు పైగా ఈవీలు అమ్ముడవ్వగా.. అందులో అత్యధిక విక్రయాలతో తమిళనాడు టాప్‌లో ఉంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా 10,44,600 విద్యుత్ వాహనాలు విక్రయాలకు రిజిస్టర్ అయినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇందులో 4,14,802 వాహనాలు ఒక్క తమిళనాడులోనే అమ్ముడవడం విశేషం. ఇందులో అత్యధికంగా ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు 1.75లక్షల యూనిట్లు కాగా.. 1.12లక్షల టీవీఎస్ మోటార్ వాహనాలు విక్రయమయ్యాయి. అత్యధికంగా చెన్నై, కొయంబత్తూర్, తిరుచిరాపల్లి, మదురై, సేలం ప్రాంతాల్లో ఈవీ విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తమిళనాడు సర్కారు ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
* టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలో ఐపీఓ (TATA Sons IPO)కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పటి వరకు భారత్‌లో ఇదే అతిపెద్ద ఐపీఓ అవ్వొచ్చని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల టాటా సన్స్‌ను ‘అప్పర్ లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ’గా వర్గీకరించింది. నిబంధనల ప్రకారం.. ఈ కేటగిరీలోకి వచ్చిన కంపెనీ.. మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది. టాటా సన్స్‌ను ఆర్‌బీఐ సెప్టెంబర్ 14న ‘అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా’ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం మూడేళ్లలో అంటే 2025 సెప్టెంబర్ 14 నాటికి ఈ కంపెనీ ఐపీఓ (TATA Sons IPO) ప్రక్రియ పూర్తి చేసుకొని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావాలి. మరో టాటా గ్రూప్ కంపెనీ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరణ పొందింది. కానీ, ఇది టాటా సన్స్‌లో విలీనం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఐపీఓకి రావాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ కేటగిరీలో చేరిన కంపెనీలపై నియంత్రణా చర్యలు పటిష్ఠంగా ఉంటాయి. టాటా సన్స్ ప్రస్తుత విలువ రూ.11 లక్షల కోట్లని అంచనా! ఒకవేళ దీంట్లో ఐదు శాతం వాటాలను విక్రయించాలనుకుంటే.. అప్పుడు ఐపీఓ పరిమాణం రూ.55,000 కోట్లు అవుతుంది. ఇదే జరిగితే భారత్‌లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుంది. ప్రస్తుతానికి రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్‌ఐసీ ఐపీఓనే అతిపెద్దది.
* ఈక్విటీ మార్కెట్లు ఊరిస్తున్నాయి. ఐపీఓలు ఆకట్టుకుంటున్నాయి. వెరసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశంలో తాజాగా ఆగస్టు నెలలో పెరిగిన డీమ్యాట్ ఖాతాలే ఇందుకు ఉదాహరణ. గతేడాదితో పోలిస్తే గత నెలలో ఏకంగా డీమ్యాట్ ఖాతాలు 26 శాతం మేర పెరిగాయి. దీంతో దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 12.7 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10.1 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 21 లక్షల డీమ్యాట్ ఖాతాలు పెరుగుతూ వచ్చాయి. జులైలో 30 లక్షల కొత్త ఖాతాలు ఓపెన్ అవ్వగా.. ఆగస్టులో 31 లక్షల కొత్త ఖాతాలు తెరుచుకున్నాయి. మొత్తం ఖాతాల్లో ఎన్‌ఎస్‌డీఎల్ వద్ద 3.3 కోట్లు, సీడీఎస్‌ఎల్ వద్ద 9.35 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టర్ అయి ఉన్నాయి.
* అమెజాన్ నాలుగు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.33.24 వేల కోట్లు) పెట్టుబడులను ప్రకటించింది. ఈ మొత్తంతో ఆంత్రోపిక్ అనే అంకుర సంస్థలో మైనారిటీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు సోమవారం వెల్లడించింది. రానున్న రోజుల్లో ఏఐ వినియోగం పెరగనున్న నేపథ్యంలో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున పెట్టుబడులను కుమ్మరిస్తున్నాయి. ఈ కొత్తతరం సాంకేతికతలోని అవకాశాలను వేగంగా అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అమెజాన్ తాజా భారీ పెట్టుబడులే అందుకు నిదర్శనం.
* దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు.. రోజంతా ఒడుదొడుకుల మధ్య చలించాయి. చివరకు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు సెప్టెంబర్ నెల డెరైవేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు ఈవారంలోనే ఉండడం కూడా సూచీలపై ప్రభావం చూపింది.
* ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) తీసుకొచ్చిన సింగిల్ ప్రీమియం బీమా ప్లాన్ ధన వృద్ధి (LIC Dhan Vriddhi) గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఏడాది జూన్‌లో తీసుకొచ్చిన ఈ పరిమితకాలపు ప్లాన్ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తోందని ఎల్‌ఐసీ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. పొదుపు+ బీమా కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాలసీ కావాలనుకునేవారు ఏజెంట్లను లేదా బ్రాంచ్‌ను సంప్రదించాలని, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చని ఎల్‌ఐసీ సూచించింది.
* దేశంలోనే అతిపెద్ద టూవీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) ఇటీవలే మార్కెట్‌లో ఆవిష్కరించిన కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 (Hero Karizma XMR 210) బైక్ ధర పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రూ.7000 పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ధర పెంచడానికి కారణాలను హీరో మోటో కార్ప్ వెల్లడించలేదు. ప్రస్తుతం హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 (Hero Karizma XMR 210) బైక్ ప్రారంభ ధర రూ.1,72.900 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. పెంచిన ధరతో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 ధర రూ.1,79,900 (ఎక్స్ షోరూమ్)కు పెరుగుతుంది. ప్రస్తుత ధరకే ఈ నెల 30 అర్ధరాత్రి వరకూ బుకింగ్స్ విండో తెరిచే ఉంటుందని హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తెలిపింది. ఆసక్తిగల మోటారు సైకిళ్ల ప్రియులు హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) డీలర్ షిప్‌ల వద్ద, అధికారిక వెబ్ సైట్‌లోనూ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 (Hero Karizma XMR 210) బైక్ బుక్ చేసుకోవచ్చు. `7046210210` ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి కూడా బైక్ బుక్ చేసుకోవచ్చు. అయితే, రూ.3000 టోకెన్ సొమ్ము పే చేయాల్సి ఉంటది. సవరించిన ధరతో హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్‌ల నూతన బుకింగ్ విండో తేదీ త్వరలో ప్రకటిస్తారు.