* బొగ్గు బట్టీల వద్ద కాపలాగా ఉన్నారు ఆ దంపతులు.. భార్య, కొడుకుతో కలిసి నిద్రిస్తోంది.. ఇంతలో అర్ధరాత్రి అమ్మా.. నాన్నను ఎవరో కొడుతున్నారంటూ ఐదేళ్ల బాలుడు తల్లికి చెప్పాడు. కానీ ఆ తల్లి పడుకోమని చెప్పి వారించింది. తెల్లవారేసరికి తండ్రి విగత జీవిగా మారాడు. ఆ బాలుడు చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బాలుడు ఏం చెప్పాడు..? పోలీసులకు కీలకంగా మారిన ఆ బాలుడు మాటలు ఏంటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. నూతనకల్ మండలం బక్కహేములతండాకు చెందిన గుగులోతు చాంప్లానాయక్(35)కు అదే గ్రామానికి చెందిన అరుణతో 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు నకిరేకల్ గురుకుల పాఠశాలల్లో చదువు తున్నారు. ఐదేళ్ల కుమారుడు వీరి వద్దే ఉంటున్నాడు. పక్కనే ఉన్న అర్వపల్లి మండలం పూర్యాతండాలో బొగ్గు బట్టీల వద్ద కాపలాగా పనిచేస్తున్నాడు. సాఫీగా సాగిన వీరి సంసారంలో రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయితే, రాత్రి తండాలో గణేష్ విగ్రహం వద్ద జరిగిన అన్నదానం, పూజల్లో దంపతులు పాల్గొన్నారు. తర్వాత తండా సమీపంలో ఉన్న బొగ్గుల బట్టి వద్ద భార్య కొడుకుతో చాంప్లా నాయక్ నిద్రించాడు. అర్ధరాత్రి చాంప్లా నాయక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు పిడిగుద్దులతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ శబ్దాల అలికిడికి మేలుకువ వచ్చి చూసిన ఐదేళ్ల బాలుడు అమ్మా.. నాన్నను ఎవరో కొడుతున్నారంటూ తల్లిని లేపాడు. కానీ పడుకోమని చెప్పి తల్లి వారించింది. తెల్లవారిన తర్వాత భార్య అరుణ.. కొడుకును తీసుకుని బక్కహేములతండాకు వెళ్లి తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని తండావాసులు, కుటుంబ సభ్యులకు చెప్పింది. భర్తతో గొడవల నేపథ్యంలో తండావాసులు అరుణను నిలదీయగా, ఆమె సరైన సమాధానం చెప్పలేదు. ఐదేళ్ల బాలుడిని కుటుంబ సభ్యులు, తండావాసులు అడగగా అర్ధరాత్రి అమ్మ, నాన్నల మధ్య ఘర్షణ జరిగిందని, కొందరు నాన్నను కొట్టారని చెప్పాడు.
* విశాఖ రామటాకీస్ ప్రాంతంలో.. కిషోర్ అనే 26 ఏళ్ల యువకుడు భవనం పైనుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమికంగా స్థానికులు ప్రమాదమని భావించినప్పటికీ.. మరో వ్యక్తి పైనుంచి కిందకు తోసేయడం వల్లే ప్రణాలు కోల్పోయినట్టు గుర్తించారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామా టాకీస్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన శివారెడ్డి.. రెల్లి వెతికి చెందిన కిరణ్.. సీతంపేటకు చెందిన కిషోర్ స్నేహితులు. ఒకరి ద్వారా ఒకరికి పరిచయమై స్నేహంగా ఉంటున్నారు. కిషోర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. ఈ ముగ్గురులో శివారెడ్డికి చెడు వ్యసనాలు మొదలయ్యాయి. దీంతో భార్యతో తరచూ గొడవ పడేవాడు. శివారెడ్డి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ముగ్గురు స్నేహితులు పరిచయంగా ఉన్నప్పుడే.. శివారెడ్డి భార్య ఉదయ్ తో సన్నిహితంగా ఉండేది. ఇదే శివారెడ్డిలో అనుమానం మొదలైంది. తన భార్యతో ఉదయ్ సన్నిహితంగా ఉండేందుకు.. కిషోర్ సహకరిస్తున్నాడని భావించాడు శివరెడ్డి. స్నేహంగా ఉంటూనే లోలోనా రగిలిపోయాడు. మద్యం తాగేందుకు శ్రీనగర్‌లోని అపార్ట్‌మెంటుకు రావాలని కిషోర్ ను పిలిచాడు. కిషోర్ తన స్నేహితులైన దేవా, కిరణ్‌లతో కలిసి అక్కడికి వెళ్లారు. అనంతరం నలుగురు కలిసి మద్యం తాగారు.. దేవా, కిరణ్ నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కిషోర్ లేచి గోడ దగ్గరికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన శివారెడ్డి.. పైనుంచి కిషోర్‌ను తోసేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో మిగతా ఇద్దరు లేచి.. కిందకు చూసేసరికి రక్తపు మడుగులో గాయాలతో కిషోర్ పడి ఉన్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు కిషోర్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పై హత్య కేసు నమోదు చేశారు. భార్యపై అనుమానం పెంచుకొని.. అది కాస్త స్నేహితుడి సహకరిస్తున్నాడని.. కోపంతో మెడ పైనుంచి తోసి ప్రాణం తీశాడని ద్వారక సీఐ సింహాద్రి నాయుడు పేర్కొన్నారు.
* ఏసీ వేసుకుని డాక్టర్ నిద్రించడంతో.. ఓ ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శామ్లి జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కైరణా ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో శనివారం ఇద్దరు శిశువులు జన్మించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ పసిపాపలను ఇద్దరిని అదే రోజు ఓ ప్రయివేటు క్లినిక్‌కు తరలించారు. దీంతో ఆ నవజాత శిశువులను ఫోటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స ప్రారంభించారు. అయితే ఆదివారం రాత్రి డాక్టర్ నీతూ హాయిగా నిద్రించేందుకు ఫోటోథెరపీ యూనిట్‌లో ఏసీ వేసుకున్నారు. ఆ చలికి తట్టుకోలేక పిల్లలిద్దరూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. చనిపోయిన పిల్లలను చూసి వారి కుటుంబ సభ్యులు డాక్టర్ నీతూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* దేశ రాజధాని దిల్లీలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణం నుంచి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించారు. పక్కాప్రణాళికతో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని భోగాల్ ప్రాంతంలో ఉమ్రావ్ జ్యూయలరీ దుకాణం ఉంది. ఎప్పటిలానే ఆదివారం పనివేళలు ముగిసిన తర్వాత సిబ్బంది దుకాణానికి తాళాలు వేశారు. ప్రతి సోమవారం సెలవు కావడంతో మంగళవారం ఉదయం షాపు తెరిచిన సిబ్బంది, చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు అంతస్థుల భవనంలో ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. దోపిడీకి పాల్పడే సమయంలో సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేసిన దొంగలు.. భవనం పై భాగం నుంచి షాపులోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌కు డ్రిల్లింగ్ మెషిన్‌తో రంధ్రం చేసి నగలు చోరీ చేసి ఉంటారని ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న నగలతోపాటు, షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలను కూడా చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఇదే తరహా చోరీ హరియాణాలోని అంబాలాలోని కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జరిగింది. బ్యాంకు గోడలకు డ్రిల్లింగ్ మెషిన్‌తో కన్నం వేసిన దొంగలు.. 32 లాకర్లలోని బంగారు ఆభరణాలను దోచికెళ్లినట్లు పోలీసులు తెలిపారు.