ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు క్రమంగా పుంజుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజులోనే ఎనిమిది పతకాలను సాధించారు. ఇందులో షూటర్లే ఏడింటిని సొంతం చేసుకోవడం విశేషం. మరొకటి సెయిలింగ్‌లో వచ్చింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో టీమ్ఇండియా ఆరో స్థానంలో కొనసాగుతోంది. షూటింగ్‌లో మూడు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, ఐదు కాంస్య పతకాలను భారత షూటర్లు కైవసం చేసుకున్నారు. టేబుల్ టెన్నిస్, చెస్, స్క్వాష్, ఈక్వస్ట్రియన్ ఈవెంట్లలో పతకాలు సాధించే దిశగా భారత క్రీడాకారులు సాగుతున్నారు. మరోవైపు ఆతిథ్య చైనా మొత్తం 131 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో 72 స్వర్ణాలే ఉండటం విశేషం. చైనా తర్వాత కొరియా ( మొత్తం 62 పతకాలు), జపాన్ (59), ఉజ్బెకిస్థాన్ (28), హాంకాంగ్ (26) ఉన్నాయి.
* భారత్‌కు ఇవాళ వచ్చిన పతకాలు ఇవీ..
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా స్వర్ణ పతకం గెలుచుకుంది.
మహిళల 25 మీటర్ల జట్టు విభాగంలో మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్ బృందం గోల్డ్ సొంతం చేసుకుంది.
మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం కైవసం చేసుకుంది.
పురుషుల స్కీట్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరుక రజత పతకం గెలిచాడు.
మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ విభాగంలో ఆషి చౌష్కీ, మనిని కౌషిక్, సిఫ్ట్ కౌర్ సమ్రాతో కూడిన జట్టు రజతం సొంతం చేసుకుంది.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తగత విభాగంలో ఆషి చౌష్కీ కాంస్యం గెలుచుకుంది.
పురుషుల స్కీట్ షూటింగ్ జట్టు విభాగంలో అంగద్, గుర్జోత్, అనంత్‌జీత్ సింగ్ కాంస్య కైవసం చేసుకున్నారు.
పురుషుల దింగే ఐఎల్‌సీఏ 7 విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య దక్కించుకున్నాడు.