* నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబరు 4వ తేదీకి వాయిదా పడింది. ఇదే కేసులో చంద్రబాబును మరో అయిదు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్‌పై కూడా విచారణ అక్టోబరు 4కు వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రెండు పిటిషన్లపై ఒకే సారి వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. వాదనలు విన్న తర్వాత ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. అమరావతి రింగురోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై విచారణను కూడా విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబరు నాలుగో తేదీకి వాయిదా వేసింది.
* మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్‌నగర్ రోడ్డులో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో కనిపించిన దృశ్యాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో సుమారు 12 ఏళ్ల వయసున్న బాలిక అర్ధ నగ్నంగా నడిరోడ్డుపై తిరుగుతూ ప్రతి ఇంటి తలుపు తడుతూ కనిపించింది . అప్పటికే ఆమె వ్యక్తిగత అవయవాల నుంచి రక్తం కారుతూ ఉంది. అత్యాచారానికి గురికావడం వల్లే ఆమెకు ఆ దుస్థితి తలెత్తింది. ఆమెను చూసి దిగ్బ్రాంతికి గురైనా.. ఎవరూ సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. ఆమె ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. చీదరించుకొని పక్కకు వెళ్లిపొమ్మని సైగలు చేయడం కనిపించింది. దిక్కుతోచని ఆమె అలాగే నడుచుకుంటూ ఓ ఆశ్రమం ప్రాంగణంలోకి వెళ్లింది. అక్కడి నిర్వాహకులు అత్యాచారం జరిగిందని అనుమానించి, ఆమె ఒంటిపై టవల్ కప్పి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..ఆమెపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆ బాలికను ఇండోర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండటంతో.. అక్కడున్న పోలీసులు రక్తదానానికి ముందుకువచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
* అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏ14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే.
* మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య వెలుగులోకి రావడంతో మరోసారి అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. విద్యార్థుల మృతికి నిరసనగా పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది.
* దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఢిల్లీలోని సుందర్ నగరి ప్రాంతంలో దివ్యాంగ ముస్లిం వ్యక్తిని ఆలయంలో ప్రసాదం తిన్నందుకు పలువురు అతడిని స్తంభానికి కట్టేసి కొట్టడంతో మరణించాడు. మూక హత్యకు పాల్పడిన పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ఇసార్ అనే వ్యక్తిపై పలువురు దాడిచేసి స్తంభానికి కట్టేసి కొట్టారు.
* గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు అమాయాకుల బ్యాంకు ఖాతాల నుంచి అందినకాడికి లూటీ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఘజియాబాద్‌కు చెందిన ప్రాచీ మాధుర్ అనే మహిళ ఏకంగా రూ. 13 లక్షలు పోగొట్టుకున్నారు.