* ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ మహిళ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షలను బ్యాంకు లాకర్‌లో ఉంచింది. చాలా రోజుల తర్వాత లాకర్‌ని తెరవగానే ఆమెకు షాకింగ్ సీన్ కనిపించింది. లాకర్‌లో ఉన్న డబ్బును పెద్ద మొత్తంలో చెదలు పట్టేసింది. ఈ ఘటన మొరాదాబాద్‌లోని ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. అల్కా పాఠక్ అనే మహిళ 2022లో బ్యాంక్ లాకర్‌లో కొన్ని విలువైన ఆభరణాలతో పాటు డబ్బును భద్రపరిచింది. అల్కా, పిల్లలకు ట్యూషన్లు చెబుతూ తన కూతురి పెళ్లి కోసం డబ్బు కూడబెట్టుకుంది. అలా సంపాదించిన డబ్బు, నగలు.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన రామగంగా విహార్ బ్రాంచ్ లాకర్‌లో నగలతో పాటు డబ్బును దాచుకుంది బాధితురాలు. ఆ డబ్బును తన కూతురు పెళ్లి కోసం కూడబెట్టింది. కొన్ని నెలల తర్వాత డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన మహిళ దీన్ని చూసి షాక్‌కు గురైంది. బ్యాంక్ లాకర్‌లో దాచిపెట్టిన డబ్బును చెదలు పట్టడం ఎంటని బాధితురాలు బోరున విలపించింది. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంక్ వద్దే ఆందోళనకు దిగింది. కాగా ప్రస్తుతం ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు.
* మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్‌లో మరో రికార్డు నమోదైంది. 2022 తొలి ఆరు నెలలతో పోలిస్తే 2023లో 62 శాతం పేమెంట్స్ పెరిగాయి. 2018 జనవరిలో 151 మిలియన్ లావాదేవీలు జరిగితే, గత జూన్ నెలలో 930 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇప్పటి వరకూ జరిగిన యూపీఐ లావాదేవీల్లో పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలే ఎక్కువ అని గ్లోబల్ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్ ‘వరల్డ్ లైన్’ మంగళవారం తెలిపింది.
* దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడే లో కొనుగోళ్ల అండతో కోలుకొని లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 65,925.64 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 65,549.96 పాయింట్ల కనిష్ఠానికి.. ఆ తర్వాత 66,172.27 గరిష్ఠాన్ని అందుకున్నది. చివరకు 173.22 పాయింట్ల లాభంతో 66,118.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 51.75 పాయింట్ల లాభపడి 19,716.45 దగ్గర స్థిరపడింది.
* భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడా నుంచి భారత్‌కు పప్పుధాన్యాల దిగుమతులు మందగించాయి. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణల నేపధ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే. దౌత్య సంబంధాల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో వర్తకంలోనూ పరిమితులు ముందుకొచ్చాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
* టెక్ రంగంలో కొలువుల కోత మరోసారి ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఖర్చులకు కత్తెర వేయడం, వ్యాపార పునర్వ్యవస్ధీకరణ పేరుతో కంపెనీలు ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది. ఇక ఏడాది కాలంగా ఉద్యోగుల తొలగింపు, నిధుల కటకట వంటి సంక్లిష్ట సమస్యలతో సాగుతున్న ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కఠిన నిర్ణయం తీసుకుంది. నూతన భారత సీఈవో సారధ్యంలో పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కంపెనీ మరో విడత లేఆఫ్స్‌కు తెగబడుతున్నట్టు తెలిసింది. తాజా లేఆఫ్స్‌తో 4000 మంది ఉద్యోగులపై వేటు పడనుందని చెబుతున్నారు.
* వచ్చే 10-15 ఏండ్లలో హైదరాబాద్ వృద్ధిబాటలో పరుగులు పెడుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రా రెడ్డి చెప్పారు. నగరంలోని హైటెక్స్‌లో నరెడ్కో అక్టోబర్ 6 నుంచి మూడు రోజులపాటు ప్రాపర్టీ షో 2023ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా చంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ ఎంత వేగంతో విస్తరిస్తున్నదో, అదే వేగం ఎన్నో ఏండ్లు ఉంటుందని హామీ ఇస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జోరుగా చేపడుతున్న కొత్త రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక అభివృద్ధి కార్యకలాపాలు, టీఎస్‌ఐపాస్, టీఎస్‌బీపాస్ తదితర సానుకూల విధానాల కారణంగా రాష్ట్రం భారీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నదని నరెడ్కో ప్రెసిడెంట్ వివరించారు. ఎల్లవేళలా విద్యుత్ లభ్యతతో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని చెప్పారు.
* ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్‌ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్ జనరల్ నుంచి గట్టి షాక్ తగిలింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్‌ఎంజీ కంపెనీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్(డీజీజీఐ) షోకాజ్ నోటీసులు జారిచేసింది. ఈ నోటీసుల్లో ఒకే కంపెనీ&ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11కు జారీ అయిన రూ.25,000 కోట్ల పన్ను నోటీసు ఉన్నది. దేశంలో ఇప్పటివరకూ జారీఅయిన పరోక్ష పన్ను నోటీసులో ఇదే అతిపెద్దది. గతంలో గేమ్స్‌క్రాఫ్ట్‌కు జారీఅయిన రూ.21,000 కోట్ల నోటీసు ఇప్పటివరకూ పెద్దదికాగా, దీనిపై కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపుగా సెప్టెంబర్ 16న గేమ్స్‌క్రాఫ్ట్ తన సూపర్‌యాప్ గేమ్జీని షట్‌డవున్ చేసింది.
* సహకార రంగంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) దేశానికే ఆదర్శంగా నిలిచింది. పలు విభాగాల్లో దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది. ఈ మేరకు ఉత్తమ సహకార బ్యాంక్ అవార్డును ప్రకటించిన రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్స్‌కాబ్).. మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, ఎండీ మురళీధర్ అందుకున్నారు. 2020-21, 2021-22 సంవత్సరాలకుగానూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ప్రథమ, ద్వితీయ అవార్డులను అందుకున్నది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్ర సహకార శిక్షణ సంస్థలలో టెస్కాబ్ సహకార శిక్షణ సంస్థ (సీటీఐ)కు 2020-21, 2021-22 సంవత్సరాలకుగాను ప్రథమ అవార్డు దక్కింది.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 9న రాజేశ్వర్ రావు మూడేండ్లకుగాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే వచ్చే నెల అక్టోబర్ 8తో ఈ గడువు తీరిపోతున్నది. ఈ క్రమంలో ఇంకో ఏడాది పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 9 నుంచి ఇది అమల్లోకి రానుండగా, అప్పట్నుంచి ఏడాది లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏది ముందైతే దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంగళవారం ఆర్బీఐ తెలిపింది.