Business

బంగారం తులం రూ.650 తగ్గి…

బంగారం తులం రూ.650 తగ్గి…

అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 24 క్యారట్ల బంగారం తులం రూ.650 తగ్గి రూ.58,950 వద్ద నిలిచింది. బుధవారం ట్రేడింగ్‌లో రూ.59,600 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.73,100 వద్ద స్థిర పడింది. అమెరికా డాలర్, యూఎస్ బాండ్లు బలోపేతం కావడంతో కామెక్స్ గోల్డ్ ధరలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1877 డాలర్లు, ఔన్స్ వెండి 22.55 డాలర్లకు పడిపోయింది. రెండో త్రైమాసికంలో అమెరికా గ్రోత్ రేట్, వారాంతపు నిరుద్యోగుల డేటాపై మార్కెట్ ఫోకస్ చేస్తున్నదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమొడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్ నీత్ దమానీ తెలిపారు. మరోవైపు, ఫ్యూచర్స్ మార్కెట్లో గురువారం తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.94 తగ్గి రూ.58,189 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో (న్యూయార్క్) ఔన్స్ బంగారం (ఫ్యూచర్స్) 0.04 శాతం తగ్గి 1891.60 డాలర్లు పలికింది.