భారీగా కురుస్తోన్న వర్షాలు, వరదలతో అమెరికా (america) లోని ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ (New York) నగరాన్ని వరదలు (Floods) ముంచెత్తాయి. దీంతో అక్కడి గవర్నర్ క్యాథి హోచుల్ న్యూయార్క్ నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. సబ్‌వేలు, ఎయిర్‌పోర్టుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో తాత్కాలికంగా వాటిని మూసివేశారు. పలు రైళ్లు రద్దయ్యాయి. కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో వరదల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని అక్కడి జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు. రెండేళ్ల కిందట కూడా సెప్టెంబర్ నెలలోనే ముంచుకొచ్చిన వరదలు ఈశాన్య రాష్ట్రాల్ని కోలుకొని విధంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా బ్రూక్లిన్, క్వీన్స్ రాష్ట్రాల్లో వరదల ధాటికి 13 మంది మృతి చెందారు.