Business

ఎయిర్‌టెల్‌కు ₹2.8కోట్లు జరిమానా-వాణిజ్యం

ఎయిర్‌టెల్‌కు ₹2.8కోట్లు జరిమానా-వాణిజ్యం

* చైనాకు చెందిన టెక్‌ కంపెనీ యులేఫోన్‌ (Ulefone) బిగ్‌ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్‌ చేసింది. యులేఫోన్‌ ఆర్మోర్‌ 24 (Ulefone Armor 24) పేరుతో ఈ పవర్‌ హౌస్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 22,000 mAh సామర్థ్యం కలిగిన బిగ్‌ బ్యాటరీతో వస్తుండడం దీని ప్రత్యేకత. అంతేకాదు ఈ ఫోన్‌ ఎమర్జెన్సీ లైట్‌ సిస్టమ్‌లా కూడా పనిచేస్తుంది. యులేఫోన్‌ ఆర్మోర్‌ 24లో 24జీబీ+ 256 జీబీ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్‌ 5 రక్షణ కూడా ఇచ్చారు. 120Hz రీఫ్రెష్‌ రేటింగ్‌తో డిస్‌ప్లే పనిచేస్తుంది. మీడియా టెక్‌ హీలియో జీ96 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇందులో వర్చువల్‌ ర్యామ్‌ను మరో 12జీబీ ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఇందులో రెండు IR LEDలు ఉన్నాయి. IR బ్లాస్టర్‌తో పాటు, ఫోన్ వెనుక ప్యానెల్‌లో నైట్ విజన్ సపోర్ట్‌తో కూడిన 64 MP కెమెరా, 64 MP వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు. NFC కనెక్టివిటీ కూడా ఉంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. మరోవైపు నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు నేడు కొనుగోళ్ల అండ లభించింది. సెన్సెక్స్‌ ఓ దశలో 600 పాయింట్లకు పైగా పెరిగి ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. కానీ, అక్కడ అమ్మకాల సెగ తగలడంతో తిరిగి కిందకు దిగొచ్చింది. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడడంతో రూపాయి పుంజుకోవడం మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 65,743.93 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,151.65 వద్ద గరిష్ఠాన్ని, 65,570.38 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 320.09 పాయింట్ల లాభంతో 65,828.41 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,581.20 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,726.25- 19,551.05 మధ్య కదలాడింది. చివరకు 114.75 పాయింట్ల లాభపడి 19,638.30 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.04 వద్ద నిలిచింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ -డిసెంబర్‌ (Oct- dec) త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల (small saving schemes) వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై (RD) వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలానికి ఈ వడ్డీ రేట్లు వర్తింపజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, పీపీఎఫ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పాపులర్‌ పథకాలతో పాటు ఇతర పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చకపోవడం నిరాశ పరిచింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై 7.1%, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 4.0%, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 7.7%, సుకన్య సమృద్ధి యోజన 8%, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 8.2%, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.5%, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది. తాజా వడ్డీ రేట్లలో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌కు అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుండగా.. సేవింగ్స్‌ డిపాజిట్‌కు కనిష్ఠంగా 4.0 శాతం వడ్డీ లభిస్తోంది.

* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రూ.2.81 కోట్ల జరిమానా విధించింది. అనధికారిక వాణిజ్య కాల్స్‌ను నిరోధించడంలో విఫలమైనందుకు పెనాల్టీ విధించింది. టెలికాం కమర్షియల్‌ కమ్యూనిషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్స్‌, 2018 నిబంధనలు ఉల్లంఘించినందుకు 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ ట్రాయ్‌ ఈ జరిమానా విధించినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌లెట్‌ పేర్కొంది. అయితే, ట్రాయ్ అదేశాలను సమీక్షిస్తున్నామని, ఈ విషయంలో తదుపరి ఏం నిర్ణయం తీసుకోవాలన్నది పరిశీలిస్తున్నామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. మరోవైపు చందాదారులను ఇబ్బంది పెడుతున్న ప్రచార సందేశాలు, కాల్స్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని గతంలో టెలికాం సంస్థలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక కాల్స్‌, సందేశాలకు సంబంధించి ఆయా సంస్థల నుంచి డేటా కూడా సేకరించింది.

* ‘క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ’ కు సన్నాహాలు ప్రారంభించింది. మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కోరుతూ దరఖాస్తు సమర్పించింది. కొత్తగా రూ.450 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయాలనుకుంటున్నట్లు ప్రాథమిక పత్రాల్లో పేర్కొంది. మరో 24.12 లక్షల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయానికి ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో మరో రూ.90 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు క్యాపిటల్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ఒకవేళ ఇది విజయవంతమైతే.. ఐపీఓ పరిమాణం తగ్గనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో టైర్‌-I మూలధనాన్ని పెంచుకోనున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. తద్వారా భవిష్యత్‌ మూలధన అవసరాలకు దీన్ని వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. మరికొన్ని నిధులను ఆఫర్లకు సంబంధించిన వ్యయాలకు కేటాయించనున్నట్లు తెలిపింది.

* ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఎయిర్‌లైన్స్‌ను దక్కించుకున్న జలాన్‌ కర్లాక్‌ కన్షార్షియం తాజాగా రూ.100 కోట్లు నగదు జమ చేసింది. దీంతో ఆ సంస్థ రూ.350 కోట్లు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టింది. 2024 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థిక కష్టాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జలాన్‌ కర్లాక్‌ కన్షార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. దీంతో కోర్టు ఆమోదించిన పరిష్కార ప్రక్రియకు అనుగుణంగా జేకేసీ రూ.350 కోట్లు జమ చేసిందని ఓ ప్రకటనలో తెలిపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించాలన్న తమ ఆశయానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది.