* దేశీయ కార్ల మార్కెట్లో రారాజు మారుతి సుజుకి. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరించడంలో ముందు ఉన్న మారుతి.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పట్టును కాపాడుకునేందుకు ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్‌యూవీ మోడల్ కారు గ్రాండ్ విటారా మరో రికార్డు నమోదు చేసింది. ఆవిష్కరించిన ఏడాదిలో లక్ష యూనిట్లు విక్రయించింది. తాజాగా మరో 22 వేల కార్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఆవిష్కరించిన నాటి నుంచి ప్రతి నెలా 8,333 కార్లు విక్రయిస్తూ వచ్చింది. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న కార్లలో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌పై 27.97 కి.మీ మైలేజీనిస్తుంది. గత నెల కార్ల విక్రయాల్లో గ్రాండ్ విటారా బెస్ట్ మోడల్‌గా నిలిచింది. ఆగస్టు (2023)లో 11,818 యూనిట్లు విక్రయించింది. ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్‌లో సేల్స్ పెరుగుతాయని మారుతి సుజుకి అంచనా వేసింది. ఇప్పటి వరకూ మారుతి సుజుకి మోడల్ కార్ల బుకింగ్స్ 3.50 లక్షలు పెండింగ్‌లో ఉండగా, వాటిలో గ్రాండ్ విటారా వాటా 31 శాతం.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్ల చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌బీఐ మరోసారి గడువును పొడిగించింది. అక్టోబర్ 7 వరకు ప్రజలు నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే 90శాతానికిపైగా తిరిగి వచ్చాయని గతంలో పేర్కొంది.
* దేశంలో విదేశీ మారకపు నిల్వలు మరింతగా పడిపోయాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 2.335 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 590.702 బిలియన్ డాలర్లకు దిగజారాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. అంతకుముందు వారంలోనూ ఫారెక్స్ నిల్వలు 867 మిలియన్ డాలర్లు పతనమైన విషయం తెలిసిందే. ఇక ఆపై వారం రోజుల్లోనైతే ఏకంగా 4.99 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో ఈ నెల 1 నుంచి 22 వరకు 8 బిలియన్ డాలర్లకుపైగానే దేశంలోని విదేశీ మారకపు నిల్వలు కరిగిపోయాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
* బంగారం ధర మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా క్రమంగా దిగొస్తున్నది. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.58,700కి దిగొచ్చింది. గడిచిన రెండు రోజుల్లోనూ ఇంచుమించుగా వెయ్యి రూపాయల వరకు తగ్గింది.
* ఉల్లిని ఉత్పత్తి చేసే రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని తొలగించింది. దీంతో లక్షలాది మంది రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఇప్పుడు వారికి సరసమైన ఉల్లి ధరలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అదే సమయంలో ఉల్లి పై ఎగుమతి సుంకాన్ని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. విశేషమేమిటంటే.. బెంగళూరు రోజ్ రకం ఉల్లి పై మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగించింది. కొన్ని షరతుల తో ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తు్న్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నిర్ణయం నేరుగా ఉల్లిని పండించే రైతులకు మేలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
* ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండాకు భారత మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత టూ వీలర్ మార్కెట్లో తనకంటూ వాటను సంపాదికుందీ కంపెనీ. ఒకప్పుడు బైక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన హెండా ఇప్పుడు స్కూటర్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. స్కూటర్ సెగ్‌మెంట్‌లో సత్తా చాటుతోన్న హోండా తాజాగా మరో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. మోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట్ ఇండియా.. భారత మార్కెట్లోకి హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. హోండా యాక్టివా స్కూటీలకు ఇండియన్ టూవీలర్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలోనే ఈ కొత్త వెర్షన్ స్కూటీని తీసుకొచ్చింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ స్కూటీని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. హోండా ఈ స్కూటీలో కీ లెస్ ఇంజన్ స్టార్ట్/ ‘స్టాప్ విత్ యాంటీ థెఫ్ట్ అనే సిస్టమ్‌తో తీసుకొచ్చింది. కేవలం కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను స్కూటీలో తీసుకురావడం విశేషం. ఇక హోండా ఈ స్కూటీని యాక్టీవా డీలక్స్ లిమిటెడ్, యాక్టీవా స్మార్ట్ లిమిటెడ్ ఎడిషన్ అనే పేర్లతో లాంచ్ చేసింది. ధర విషయానికొస్తే యాక్టీవా డీలక్స్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 8,743 (ఎక్స్ షోరూమ్)గా ఉండగా, యాక్టీవా స్మార్ట్ లిమిటెడ్ ఎడిష్ ధర రూ. 82,734 (ఎక్స్ షోరూమ్)గా ఉన్నాయి. ఇక ఈ స్కూటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్యాడీ ప్యానెల్స్‌పై సస్ట్రైప్ గ్రాఫిక్స్‌తో బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్, డార్క్ కలర్ థీమ్ ఫీచర్స్‌ను అందించారు. ఇక రెయిర్ గ్రాబ్ రైల్ పై బ్లాక్ క్రోమ్ గార్నిష్‌తో పాటు యాక్టీవా 3డీ లోగోను ఇచ్చారు. బాడీ కలర్ డార్క్ ఫినిష్‌తో ఇచ్చారు.