నే నెవరు? నా మూలాలు ఏమిటి? ఇంటా, బయటా అందరి రంగూ ఒకలా ఉంది. నేను మాత్రం ఇలా.. చామనఛాయగా? నేను ఇక్కడి వాడిని కాదా? అచ్చమైన భారతీయుడిలా కనిపించే నేను స్విట్జర్లాండ్‌లో ఎందుకున్నాను? .. ఎన్నో ప్రశ్నలు నన్ను వేధించేవి. శూలాల్లా గుచ్చుకునేవి. మొత్తానికి నా అన్వేషణ ఫలించింది. నా పరిశోధన ద్వారా కొంత తెలుసుకున్నాను. నన్ను పెంచిన తల్లిదండ్రులు ఇంకొన్ని వివరాలు అందించారు. రికార్డుల ప్రకారం మా అమ్మ పేరు అనసూయ. యాభై రెండేండ్ల క్రితం ఉడుపిలోని సర్కారు దవాఖానలో నాకు జన్మనిచ్చింది. ఆ కేరళ వనిత పేదరికమో, కుటుంబ పరిస్థితులో. కారణం ఏమిటో తెలియదు కానీ నన్ను డాక్టరుకు అప్పగించి నిశ్శబ్దంగా నిష్క్రమించింది. ఆ సమయంలో అమ్మ గుండెకోతను ఊహించగలను. అయినా, తన మీద నాకు ఏమాత్రం కోపంలేదు. ద్వేషం అసలే లేదు. ఇప్పటికీ.. అపారమైన ప్రేమ పొంగిపొర్లుతున్నది. తొమ్మిది నెలలూ నన్ను మోసి.. రక్తమాంసాలు పంచిన ఆ దేవతకు జన్మజన్మలకూ రుణపడి ఉంటాను. నా దృష్టిలో ఆమె మహా ధైర్య వంతురాలు. విధికి ఎదురొడ్డి నిలిచిన సమర్థురాలు. ఆ యుద్ధంలో నేనెక్కడ గాయపడతానో అనే భయంతో నన్ను వదిలి వెళ్లిందేమో. ఎవరికి తెలుసు? ఏదో ఒకరోజు తనను కలుసుకుంటానేమో! ఎక్కడున్నా తాను క్షేమంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తాను. ఇప్పటికే మరణించి ఉంటే.. అమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలిగించమని ప్రార్థిస్తాను. నేనెప్పుడూ అమ్మను వెతికే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే, నన్ను అప్పగించి వెళ్తూ వెళ్తూ ‘కంటికి రెప్పలా చూసుకునేవారికే నా బిడ్డను ఇవ్వండి. నా గురించి ఎప్పుడూ వాడికి చెప్పొద్దు’ అని వేడుకుందట. అదే అమ్మ నిర్ణయం అయినప్పుడు, బిడ్డగా దాన్ని గౌరవించడం నా బాధ్యత. అమ్మ మీద ప్రేమతోనే నా పెద్ద కూతురికి అనసూయ అని పేరు పెట్టుకున్నాను. తనలోనే నా తల్లిని చూసుకుంటాను. ‘అమ్మా..’ అని నోరారా పిలుచుకుంటాను. ఎవరికి తెలుసు, ఆ తల్లి .. నా చిట్టితల్లిగా పుట్టిందేమో.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్రిట్, ఎలిజబెత్ దంపతులు పదిహేను రోజుల పసికందుగా ఉన్న నన్ను దత్తత తీసుకున్నారు. నీడనిచ్చారు. చదువులు చెప్పించారు. వ్యక్తిత్వాన్ని ప్రసాదించారు. ఆ ఇద్దరూ కేరళలోని ఓ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో కొంతకాలం పని చేశారు.. నాన్న ప్రిన్సిపల్, అమ్మ జర్మన్ టీచర్. స్వదేశానికి వెళ్తూ వెళ్తూ నన్నూ తీసుకెళ్లారు. అప్పటికి నాకు నాలుగేండ్లు. నిజానికి ఆ స్విట్జర్లాండ్ దంపతులు నన్ను మా అమ్మ ఒడికి చేర్చాలని ఎంతో ప్రయత్నించారు. ‘అమ్మా.. ఇదిగో మీ కొడుకు! మా దగ్గర ఉన్నాడు. వచ్చి తీసుకెళ్లండి’ అంటూ నా ఫొటోతో ఓ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఆ కాపీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. అయినా, ఎలాంటి స్పందనా కనిపించలేదు. దీంతో నన్ను దేవుడిచ్చిన బిడ్డగా భావించారు. వాళ్లేం సంపన్నులు కాదు. నా పెంపకం కోసం చాలా త్యాగాలు చేశారు. వాళ్లపై మరింత బరువు మోపడం ఇష్టం లేక.. చదువుకొంటూనే ట్రక్ నడిపాను. తోటమాలిగా పనిచేశాను. బాల్యం నుంచీ మనుషుల్ని, మనసుల్ని అర్థం చేసుకోవడం నాకు ఇష్టం. అందుకే సైకాలజీ చదివాను. నాన్న ఓ వృద్ధాశ్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. దీంతో వయోధికులకు సేవ చేసే అవకాశం లభించింది. సునామీ సమయంలో ఎంతోమందికి మానసిక చికిత్స అందించాను. ఎంపీ అచ్యుత్ సామంత్‌తో కలిసి ఒడిశా గిరిజన ప్రాంతాల్లో పర్యటించాను. స్విట్జర్లాండ్‌లోనూ చురుకైన ప్రజా జీవితం నాది. కాబట్టే, టౌన్ కౌన్సెలర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగాను. ప్రతి మహిళలోనూ అమ్మను చూసుకుంటున్నాను.