DailyDose

మహిళను లైంగికంగా వేధించిన పోలీసులు-నేరవార్తలు

మహిళను లైంగికంగా వేధించిన పోలీసులు-నేరవార్తలు

* వారం రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలోని భోగల్‌.. జంగ్‌పురా ప్రాంతంలో ఉన్న ఉమ్రావ్‌ సింగ్‌ నగల దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబరు 22న జరిగిన ఈ చోరీ కేసులో పోలీసులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లోకేశ్‌ శ్రీవాస్‌, శివ చంద్రవంశీ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో ప్రధాన నిందితుడు శ్రీవాస్‌ దొంగతనం చేసిన తీరును పోలీసులకు వివరించాడు. శ్రీవాస్‌ ఒంటరిగానే ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. కేవలం రూ.1,400 ఖరీదైన టూల్స్‌తో రూ.25 కోట్ల విలువైన నగలు కొట్టేసిన శ్రీవాస్‌.. దొంగతనానికి రెండు రోజుల ముందే నగల దుకాణం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబరు 9, 17 తేదీల్లో రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడించాడు.

* నగల దుకాణంలో గోడకు రంధ్రం చేసేందుకు దిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలో రూ. 100 టూల్‌ బాక్స్‌, జీబీ రోడ్‌లో ఓ దుకాణం నుంచి రూ. 1,300కు డిస్క్‌ కట్టర్‌ను కొనుగోలు చేసిన నిందితుడు, వీటితోపాటు ఇంటి నుంచి తెచ్చిన స్క్రూ డ్రైవర్‌, కటింగ్ ప్లేర్‌ ఉపయోగించాడు. సెప్టెంబరు 22న రాత్రి 11 గంటల సమయంలో భవనం నాలుగో అంతస్తు నుంచి నగల దుకాణంలోకి ప్రవేశించి సీసీ కెమెరాల వైర్లు కట్‌ చేశాడు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ గోడకు డ్రిల్లర్‌ సాయంతో రంధ్రం చేసి అందులోని నగలతోపాటు, దుకాణంలో డిస్‌ప్లేలో ఉన్న ఆభరణాలను చోరీ చేశాడు. దొంగతనం చేసిన తర్వాత రెండు రోజులపాటు దిల్లీలోనే ఉండి, సెప్టెంబరు 24న బిలాస్‌పూర్‌ పారిపోయాడని పోలీసులు తెలిపారు. దిల్లీలోని కశ్మీర్‌ గేట్‌ బస్‌ టెర్మినల్‌లో శ్రీవాస్‌ రెండు బ్యాగులతో ఉన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడి గురించి ఆరా తీశారు. అదే సమయంలో దొంగతనం జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను పరిశీలించిన పోలీసులు శ్రీవాస్‌ మొబైల్‌ అదే ప్రాంతంలో స్విచ్ఛాఫ్‌ అయి, మరుసటి రోజు రాత్రి చాందినీ చౌక్‌లో స్విచ్ఛాన్‌ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో బిలాస్‌పూర్‌ చేరుకున్న శ్రీవాస్‌, నగలను అమ్మేందుకు పాత నేరస్థుడి సాయం కోరడంతో.. అతను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు సమాచారం అందించాడు. వారిచ్చిన సమాచారంతో బిలాస్‌పూర్‌ చేరుకున్న దిల్లీ పోలీసులు శుక్రవారం శ్రీవాస్‌ను, అతడికి సహకరించినందుకు శివ చంద్రవంశీని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 18 కిలోల బంగారం, రూ. 12.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

* హెచ్చెల్సీలో కొట్టుకు వచ్చిన మృతదేహం ఆచూకీ లభ్యమైంది. యువకుడిని హత్య చేసి, కాళ్లూచేతులు కట్టేసి హెచ్చెల్సీలో పడేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన మేరకు… బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు శివారులోని హెచ్చెల్సీ 119/500 కిలోమీటర్‌ వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ శివ… శనివారం ఉదయం అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. హత్య చేసి కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి హెచ్చెల్సీ ప్రధాన కాలువలో పడేసినట్లుగా నిర్ధారించారు. లభ్యమైన ఆధారాలను బట్టి హతుడిని బళ్లారిలోని మేదార్‌ కేతయ్య నగర్‌ (ఎమ్‌కే నగర్‌)కు చెందిన ఎం.వినోజ్‌ (30)గా గుర్తించారు.

* హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు తుమ్మల రాజు(30) హత్యకు గురయ్యాడు. కాళ్లు, చేతులను తాడుతో కట్టి హత్య చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్సారెస్పీలో పడేసినట్లు సమాచారం.. మృతదేహాం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మడిపల్లికి చెందిన తుమ్మల రాజు బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు.అయితే అన్నాసాగరానికి చెందిన తన బాల్యే స్నహితురాలితో రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈవిషయమై పలుమార్లు రాజును హెచ్చరించినా మార్పు రాలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

* పెళ్లి కోసం ఒత్తిడి చేసిన సహోద్యోగిని పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ హత్య చేశాడు. రెండేళ్ల తర్వాత ఈ విషయం బయటపడటంతో అతడు అరెస్ట్‌ అయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్‌ సురేంద్ర, మహిళా కానిస్టేబుల్ రుచిక మధ్య ఏర్పడిన పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో పెళ్లి కోసం ఆమె ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో వివాహితుడైన సురేంద్ర ఆమె అడ్డుతొలగించుకోవాలని భావించి హత్య చేశాడు. కాగా, ఢిల్లీలోని కాల్‌ గాల్స్‌ను ఇతర నగరాలకు తీసుకెళ్లి సురేంద్ర ఎంజాయ్‌ చేసేవాడు. ఈ క్రమంలో రుచికాకు సంబంధించిన పత్రాలు, వస్తువులను పలు చోట్ల వదిలేవాడు. దీంతో అదృశ్యమైన మహిళా కానిస్టేబుల్‌ తనుకు తానుగా ఎక్కడికో వెళ్లి ఉంటుందని పోలీసులు భావించారు. తన కుటుంబం వద్దకు తిరిగి వచ్చేందుకు ఆమె ఇష్టపడటం లేదని అనుకున్నారు.

* స్పెయిన్‌లోని ముర్సియ నైట్‌క్ల‌బ్‌లో ఆదివారం జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 11 మంది మ‌ర‌ణించారు. స‌హాయ సిబ్బంది శిధిలాలు తొల‌గిస్తుండ‌టంతో మృతుల సంఖ్య పెర‌గ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. నైట్‌క్ల‌బ్‌లో అగ్నిప్ర‌మాదానికి కారణాలేంట‌నేది ద‌ర్యాప్తు అనంతం వెలుగుచూస్తాయ‌ని, ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 11 మంది మ‌ర‌ణించార‌ని పోలీసులు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల విభాగం విడుద‌ల చేసిన ఫొటోల ప్ర‌కారం ఫాండా మిల‌గ్రోస్‌గా పిలిచే టీట్రే నైట్ క్లబ్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. నైట్‌క్ల‌బ్ భ‌వ‌నం పైక‌ప్పు నుంచి పొగ వ్యాపిస్తుండ‌టం ఈ ఫొటోల్లో క‌నిపించింది. శ‌నివారం రాత్రి బ‌ర్త్‌డే పార్టీ జ‌రిగింద‌ని, ఈ వేడుక‌కు హాజ‌రైన‌వారిలో కొంద‌రి ఆచూకీని ఇంకా గుర్తించ‌లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. నైట్‌క్ల‌బ్ ఫ‌స్ట్ ఫ్లోర్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాధ‌మిక వివ‌రాల్లో వెల్ల‌డైంది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు గాయ‌ప‌డగా, వీరంతా పొగ‌ను పీల్చ‌డంతో అస్వ‌స్ధ‌త‌కు లోన‌య్యార‌ని అధికారులు చెప్పారు. ఘ‌ట‌నా స్ధలానికి 40 అగ్నిమాప‌క యంత్రాలు 12 అత్య‌వ‌స‌ర వాహ‌నాలు చేరుకున్నాయ‌ని ముర్సియ మేయ‌ర్ జోస్ బ‌లెస్ట తెలిపారు.

* కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.1000 బలవంతంగా పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్‌ 13న నోయిడాకు చెందిన 22 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని సాయి ఉపవన్‌ పార్క్‌ను సందర్శించింది.

పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలో విధులు నిర్వహించే ముగ్గురు పోలీసులు ఆ జంటను వేధించారు. కాబోయే భర్త చెంపపై కొట్టారు. కోరిక తీర్చాలని ఆ మహిళను పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేష్‌ కుమార్‌ బలవంతం చేశాడు. అలాగే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ జంటను విడిచిపెట్టేందుకు ఒక పోలీస్‌ పది వేలు మరో పోలీస్‌ ఏకంగా రూ.5.5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఆ జంటను సుమారు మూడు గంటలపాటు వేధించారు. చివరకు ఆ మహిళ మొబైల్‌లోని పేటీఎం యాప్‌ నుంచి రూ.1,000 ట్రాన్స్‌పర్‌ చేసుకుని విడిచిపెట్టారు. అంతటితో ఆగని ఆ పోలీసులు ఆ మహిళను ఆ తర్వాత కూడా వేధించారు. సెప్టెంబర్‌ 19న రాకేష్‌ కుమార్‌ ఆమెకు ఫోన్‌ చేశాడు. తన కోరిక తీర్చాలని అసభ్యంగా మాట్లాడాడు. ఆమె ఆ కాల్‌ను రికార్డ్‌ చేసింది. సెప్టెంబర్‌ 22న ఆ ముగ్గురు ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో పోలీసుల వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. అత్యవసర నంబర్‌కు కాల్‌ చేసింది. కాగా, మహిళ నుంచి విషయం తెలుసుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. ఆమెను లైంగికంగా వేధించిన పోలీసులపై పలు సెక్షన్ల కింద సెప్టెంబర్‌ 28న కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులైన కానిస్టేబుల్‌ రాకేష్ కుమార్, హోంగార్డు దిగంబర్ కుమార్‌తోపాటు మరో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేష్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేసినట్లు పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. హోంగార్డ్‌పై చర్యల కోసం ఆ విభాగానికి లేఖ రాసినట్లు చెప్పారు.