వైద్య శాస్త్రం (medicine)లో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం (Nobel Prize)-2023 వరించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలు.. కొవిడ్ (Covid 19)ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA Vaccine) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది.
హంగేరీకి చెందిన కాటలిన్ కరికో.. అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు.. అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయని వీరు తమ పరిశోధనలో గుర్తించారు. దీనిపై 2005లో వీరు ఓ పేపర్‌ను కూడా పబ్లిష్ చేశారు. అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందనప్పటికీ.. కొవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరి పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివర్లో రెండు mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించడమేగాక.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగాయి అని నోబెల్ బృందం వెల్లడించింది.
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.