ScienceAndTech

గూగుల్ గురించి సత్య నాదెళ్ల వాంగ్మూలం-తాజావార్తలు

గూగుల్ గురించి సత్య నాదెళ్ల వాంగ్మూలం-తాజావార్తలు

* దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల్లో మళ్లీ రికార్డ్‌ నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు వరుసగా రెండో సారి 10 బిలియన్ లావాదేవీల మార్క్‌ను దాటాయి. గడిచిన ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు మొదటిసారిగా 10 బిలియన్‌ లావాదేవీలు నమోదయ్యాయి. మళ్లీ సెప్టెంబర్‌ నెలలో రెండో సారి 10 బిలియన్‌ లావాదేదీలు జరిగాయి.

* జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం భారత్‌కు చెందిన మైనింగ్‌ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలిసింది. బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

* బీఆర్‌ఎస్‌ పార్టీ బరాబర్‌ వారసత్వ పార్టీనే అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌. తమది వారసత్వ పార్టీ అని, కుటుంబ పాలన అని విమర్శిస్తున్న వాళ్లకి తనదైన శైలిలో బదులిచ్చారు కేటీఆర్‌. సూర్యాపేట సభలో ప్రసంగించిన కేటీఆర్‌. ‘ బరాబర్‌ మాది కుటుంబ పాలనే. ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్‌ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. ఎందరో నాయకుల త్యాగఫలమే వారసత్వ పార్టీ. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. సూర్యాపేటలో జగదీష్‌రెడ్డిని 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.

* మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కోర్టు మెట్లెక్కనున్నారు. ఆన్‌లైన్‌ సెర్చ్‌, వ్యాపార ప్రకటనలలో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్‌పై అమెరికా న్యాయ శాఖ విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా నిజానిజాలు వెల్లడించేందుకు సత్య నాదెళ్ల నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు గూగుల్‌ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ యాప్‌ను తమ టాప్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుంది.

* అక్టోబర్‌ 2.. గాంధీ జయంతి. స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహానుభావుడు మహాత్మ పుట్టినరోజు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెగాస్టార్‌.. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌(CCT) స్థాపించి ఎంతోమందికి రక్తదానం చేశారు. ఈ ట్రస్ట్‌ కార్యకలాపాలు మొదలై నేటికి పాతికేళ్లు పూర్తి కావడంతో చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రోజునే చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభమైంది. 25 సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. 10 లక్షలకు పైగా బ్లడ్‌ యూనిట్స్ సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశాం. 10 వేల మందికి పైగా కంటిచూపు ప్రసాదించాం. కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడాం. తోటి మానవులకు సేవ చేయడం ద్వారా వచ్చే సంతృప్తిని మాటల్లో వెలకట్టలేం. CCT చేపట్టిన మానవతా కార్యక్రమాల్లో భాగమైన లక్షలాది మంది సోదర సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. మన దేశానికి చేస్తున్న చిరు సాయం ఇది! ఇదే మహాత్ముడికి మనం సమర్పించే అసలైన నివాళి!’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు తాను రక్తదానం చేస్తున్న ఫోటోను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. చిరు మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

* మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్ర్యంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు.

* తిరుమలలో రద్దీ కొనసాగుతోందని, రద్దీ కారణంగా, భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. సోమవారం ఉదయం టీటీ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, శిలాతోరణం మార్గంలో గల క్యూలైన్స్, గోగర్భం డ్యాం వరకూ ఉన్న క్యూలైన్స్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం క్యూలైన్స్ వద్ద భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌఖర్యాలపై టీటీడీ అధికారులకు భూమన కరుణాకర్ రెడ్డి సలహాలు, సూచనలు చేసారు. టీటీడీ చైర్మన్‌ మాట్లాడుతూ..పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, స్వామీ వారి సర్వదర్శనానికి 35 గ‌ంటల సమయం పడుతుందన్నారు. భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు. క్యూలైన్స్‌లో ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు రేయింబవళ్ళు కష్టపడి సౌఖర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు దగ్గరుండి సౌకర్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

* ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏదో కొత్త హామీలు అన్నట్లు మాట్లాడారని.. మోదీ చేసిన మోసానికి కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులపైనా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

* ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అనైతిక వ్యక్తి పవన్‌ కల్యాణేనని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసొస్తే ఆదరణ ఉండదనే విషయం వారాహి యాత్ర ఫ్లాప్‌తో పవన్‌కు ఇప్పుడు అర్థమైందని అంబటి తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన చీఫ్‌ తీరుపై మండిపడ్డారు. కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్న చందాన వారాహి యాత్ర తయారైంది. చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే వారాహి-4 యాత్ర ఫ్లాప్‌ అయ్యింది. కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్‌ సభలు పెడుతున్నారు. ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్కు. పవన్‌ సభలకు వెళ్లండి అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. కానీ, సాయంత్రం ఆరు గంటలైనా జనం పవన్‌ సభకు రాలేదు. చంద్రబాబుతో పొత్తును ప్రజలు ఛీ కొట్టారు. బీజేపీతో ఉన్నాను అంటావ్‌.. టీడీపీతో వెళ్తాను అంటావ్‌. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా? అని పవన్‌ను అంబటి ప్రశ్నించారు.

* ఉదయపూర్ జైపూర్ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల వెంబడి ఇటుక సైజులో ఉన్న రాళ్లను గమనించిన లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రాళ్లు అమర్చి ఉన్న చోటుకు ముందే రైలు ఆగింది. రైల్వే సిబ్బంది ఈ రాళ్లను తొలగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

* కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోతల రాయుడని.. ఆయన చేయలేని పనులను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేసి చూపించాడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొని మాట్లాడారు. నల్గొండలో ప్రారంభించుకున్న ఐటీ హబ్‌ అత్యద్భుతమన్నారు. రాష్ట్రంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ హబ్ నిర్మితమైందని, నల్గొండ నగరాన్ని భూపాల్‌రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అతి త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు.

* కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పవన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రధాన్యం ఉందని.. తనను ఎంతగానో ప్రభావితం చేసిన నేల ఇదని చెప్పారు. ‘‘పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన నేల ఇది. దుబాయ్‌ వంటి చోట్ల మూడింట రెండొంతులు భారతీయులే ఉంటారు. కులాల ఐక్యత గురించి నేను పదే పదే చెబుతాను. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని గుర్తించాలి. కాపు కులంలో పుట్టినా.. నేను అన్నింటినీ సమదృష్టితో చూసే వ్యక్తిని. నేను కులాలను వెదుక్కొని స్నేహాలు చేయను. వైకాపా కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలి?

* ఎలాంటి ఆధారాలు లేకుండా తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అరెస్టు చేసిన ఇన్ని రోజులకు కూడా సీఐడీ అధికారులు ఆధారాల కోసం వెతుక్కుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు, అరెస్టులను నిరసిస్తూ విజయవాడలోని కేశినేని భవన్‌ వద్ద ‘సత్యమేవ జయతే దీక్ష’ చేపట్టారు.

* అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారని… తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) ధీమా వ్యక్తంచేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్న సైకో జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు.

* అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష చేపట్టారు.