Business

రాజస్థాన్‌లో నోట్ల వర్షం-వాణిజ్యం

రాజస్థాన్‌లో నోట్ల వర్షం-వాణిజ్యం

* రాజస్థాన్‌లోని జైపూర్‌లో నోట్ల వర్షం కురిసిన ఘటన గందరగోళ పరిస్థితికి దారి తీసింది. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. ఫలితంగా ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన జైపూర్‌లోనిమాల్వియా నగర్‌లోని గౌరవ్ టవర్ సమీపంలో చోటు చేసుకుంది. ‘మనీ హీస్ట్’ సిరీస్‌ స్ఫూర్తితో మనిషి నోట్ల వర్షం కురిపించాడు. తన ముఖంపై సాల్వడార్ డాలీ మాస్క్‌తో ఎరుపు రంగు జంప్‌సూట్‌లో ఉన్నట్టుండి బిజీగా ఉన్న మార్కెట్‌లో గాలిలో డబ్బుల వర్షం కురిపించాడు. దీనితో భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలు వీలైనన్ని ఎక్కువ నోట్లను అందిపుచ్చుకోవడానికి పరుగులు తీశారు. ఇందులో దాదాపు అన్నీ 20, 10 రూపాయల నోట్లు ఉన్నట్టు సమాచారం.

* ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్‌) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌ (ట్విటర్‌) తరహాలో మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించుకోవాలంటే నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనుందని సమాచారం. ఈ సబ్‌ స్క్రిప్షన్‌ విధానం యాడ్స్‌ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారీ చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్‌ దేశాలకు చెందిన మెటా, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల నుంచి యాడ్‌- ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌ పేరుతో మెటా నెలకు రూ.1,165 వసూలు చేస్తుంది. మరి ఆసియా దేశాల్లో అతిపెద్ద సోషల్‌ మీడియా మార్కెట్‌గా కొనసాగుతున్న భారత్‌లోని యూజర్లకు ఈ సబ్‌స్క్రిప్షన్‌ విధానం ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా భారత్‌ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌కు అనుమతి ఇవ్వనుందనే అంచనాలు నెలకొన్నాయి.

* ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ కాలంలో తీసుకొచ్చిన వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్‌ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇపుడిక విప్రో, క్యాప్‌జెమినీ LTIMindtree టాప్‌ కంపెనీలు వారంలో అన్ని రోజులు లేదా సగం రోజులు ఇక ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం రిమోట్‌ వర్క్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పాయి. దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్‌లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్‌ వర్క్‌ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు.

* ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ ఆధారాలతో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల వాషింస్టన్‌ డీసీ కోర్టుకు హాజరయ్యారు. అమెరికా న్యాయశాఖకు, ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్‌కు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో సత్యనాదెళ్ల అత్యంత కీలకమైన ఆధారాల్ని ఇవ్వడంతో పాటు, కోర్టుకు సాక్ష్యం కూడా చెప్పారు. ఇటీవల కాలంలో గూగుల్‌ గత కొన్నేళ్లుగా యాంటీట్రస్ట్‌ ట్రయల్స్‌ విచారణ ఎదుర్కొంటుంది. ఇతర సంస్థలు ఎదగనీయకుండా గూగుల్‌ నియంత్రిస్తుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అమెరికా న్యాయ శాఖ గూగుల్‌పై చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గూగుల్‌ను తీరును తప్పుబడుతూ వ్యక్తులు, లేదంటే సంస్థలు చేసిన ఫిర్యాదుల నుంచి ఆధారాలు సేకరిస్తుంది. కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సైతం ఉంది. ఈ క్రమంలో వాషింస్టన్‌ డీసీ కోర్టు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల నుంచి పలు సాక్ష్యాలు ఆధారాల్ని సేకరించింది. అంతేకాదు, గూగుల్‌ తన ప్రత్యర్ధి సంస్థల భవిష్యత్‌ను అగాధంలోకి నెట్టేలా వ్యవహరిస్తుందని, తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా సత్యనాదెళ్ల ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా సెర్చ్‌ ఇంజిన్‌ ఇండస్ట్రీలో గూగుల్‌కు సామర్ధ్యంపై కోర్టు పలు ప్రశ్నలకు సత్యనాదెళ్ల సమాధానం ఇచ్చారు. గూగుల్‌ – యాపిల్‌ మధ్య జరిగిన మల్టీ బిలియన్‌ డాలర్ల ఒప్పందం కారణంగా మైక్రోసాఫ్ట్‌ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన సెర్చ్‌ ఇంజిన్‌లైన ఎడ్జ్‌, బింగ్‌లు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందంటూ మండిపడ్డారు.

* గత వారం రోజులుగా రోజురోజుకి బంగారం ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఏకంగా 10 గ్రాముల బంగారం ధరలు మునుపటి కంటే రూ. 600 నుంచి రూ. 660 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం & వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూసేద్దాం. విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5260 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5738గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 55260, 24 క్యారెట్ పసిడి ధర రూ. 57380గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణంలో కూడా ఉన్నాయి. వెండి ధరల విషయానికి వస్తే విజయవాడలో 10 గ్రాముల వెండి రూ. 735. కావున ఒక కేజీ వెండి ధర రూ. 73500గా ఉంది. ఈ ధర నిన్నటి కంటే కూడా రూ. 2000 తక్కువ. నిన్న కేజీ వెండి ధర రూ. 75500గా ఉంది. వెండి కొనేవారికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇదే ధరలు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.

* “నవరత్నాలు”లో భాగమైన పెదలందరికి ఇల్లు పథకం కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న దృఢమైన అంకితభావానికి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. హౌసింగ్ డిపార్ట్‌మెంట్, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సహకారంతో లబ్ధిదారులకు ఎనర్జీ ఎఫిషియెన్సీ స్టార్-రేటెడ్ ఉపకరణాలను అందించడానికి చర్యలు తీసుకుంది. దీని ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు, గణనీయమైన ఇంధన వనరుల పరిరక్షణకు హామీ ఇస్తుంది. ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ప్రభుత్వ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కౌన్సెలర్ జోనాథన్ డెమెంగే, దక్షిణ భారతదేశం.. కేంద్ర పాలిత ప్రాంతాలలో వ్యాపార అభివృద్ధి & ప్రభుత్వ వ్యవహారాల కోసం ఈఈఎస్ఎల్ సలహాదారు ఎ చంద్రశేఖర్ రెడ్డికి పంపిన కమ్యూనికేషన్‌లో ఈఈఎస్ఎల్ అండ్ గృహనిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఆకట్టుకునేలా అమలు చేస్తోందని తెలిపారు.