* వైకాపా ప్రభుత్వం అడ్డదారిలో వెళ్తోందని.. ధైర్యంగా ఎదుర్కోవాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరిని రాజధాని అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ.. ‘‘రైతుల త్యాగాలు వృథా కావు. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదే మన ఆయుధం’’ అని భువనేశ్వరి అన్నారు.
* రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఓటమి భయంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.
* తెలుగుదేశం – జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక చేనేతలకు మంచిరోజులు వస్తాయని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పేదల కడుపు కొడుతూ ముఖ్యమంత్రి జగన్ క్లాస్ వార్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
* ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. భౌతిక శాస్త్రం (Physics)లో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు
* అంతరిక్షంలో (Space) లక్ష్యం లేకుండా సంచరిస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని (Asteroid) శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఒక స్థిర మార్గం, గమ్యం లేకుండా ప్రయాణించడం ఆందోళనకు గురిచేస్తోంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆ ‘కాస్మిక్ నొమాడ్’ కొన్ని సార్లు ఖగోళ వస్తువులు, ఇతర గ్రహాలకు దగ్గరగా వస్తున్నట్లు తెలిసింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భూమికి అతి సమీపంగా వెళ్లే గ్రహశకలాలతో ఓ జాబితాను తయారు చేసింది.
* తెదేపా (TDP) నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలని చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చినట్లు తెలుగుదేశం సీనియర్ నేత చినరాజప్ప (ChinaRajappa) తెలిపారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారని, న్యాయపోరాటంలో గెలుస్తామని చెప్పినట్లు వివరించారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్ ద్వారా చినరాజప్ప కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలిచి, వైకాపా పాలనను తరిమికొడదామని పిలుపునిచ్చారు.
* ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య (Nijjar Killing) కేసులో కెనడా (Canada) దర్యాప్తునకు భారత (India) ప్రభుత్వం సహకరించాలని అగ్రరాజ్యం అమెరికా (USA) మరోసారి సూచించింది. ఈ విషయమై ఇప్పటికే బైడెన్ యంత్రాంగం దిల్లీ అధికారులతో పలు సార్లు చర్చించినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంలో కెనడాతో తాము సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
* ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Nijjar Killing) హత్య కేసుతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు (India-Canada Diplomatic Row) కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లో వారి దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 10లోగా దాదాపు 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్ గతంలోనూ కెనడా (Canada)కు సూచించిన విషయం తెలిసిందే. ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్ విదేశాంగ శాఖ.. దిల్లీ (New Delhi)లో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
* ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సీఐడీ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేశ్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేశ్ తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. హెరిటేజ్ సంస్థలో లోకేశ్ షేర్ హోల్డర్ అని, ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలన్నా కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని కోర్టుకు వివరించారు. లోకేశ్‌ను ఇవి అడగడం సమంజసం కాదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై స్పందించిన పోసాని అంత తొందరేముందని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబరు 10న సీఐడీ విచారణకు లోకేశ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేశ్‌కు సీఐడీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
* తెలుగుదేశం – జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక చేనేతలకు మంచిరోజులు వస్తాయని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పేదల కడుపు కొడుతూ ముఖ్యమంత్రి జగన్ క్లాస్ వార్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘జగన్ అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారు. పాదయాత్రలో నోటికి ఏదొస్తే అది వాగ్దానం చేశారు. ఇప్పుడు అమలు చేయకుండా అందరినీ మోసం చేశారు. క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ అసలు ఉద్దేశం ఏంటి? నిజంగా క్లాస్ వార్ చేస్తుంది జగనే. పేదలకు అండగా ఉండకుండా మాటలతో మోసం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు భారం తప్ప, ప్రయోజనం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే బాధ్యతను జనసేన తీసుకుంటుంది. వారికి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తాను. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎయిడెడ్ విద్యాసంస్థలు రద్దు చేశారు. అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వ కళాశాలల భూములను రియల్ ఎస్టేట్ కోణంలో చూస్తున్నారు. విద్యకు ప్రాధాన్యత అనేది జగన్ మాటలకే పరిమితమైంది. విభిన్న ప్రతిభావంతుల కోసం ₹కోట్లు ఖర్చు పెడుతున్నా.. వారికి మేలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉంటే.. ఒకరికే పెన్షన్ అంటే ఎలా? ఈ ప్రభుత్వానికి మానసిక దృక్పథం లేదు. విభిన్న ప్రతిభావంతులకు జనసేన అండగా ఉంటుంది. సైన్ లాంగ్వేజ్ విధానాన్ని ప్రతి కార్యాలయంలో ఉండేలా చూస్తాం. బడ్జెట్‌లో కూడా ఎక్కువ నిధులు కేటాయించి, అండగా ఉంటాం’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
* ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి (సీఈవో) సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధ్యాపకులకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియను గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది చేపట్టారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందికి అనుభవలేమి, బూత్ లెవెల్ అధికారుల అనుభవ రాహిత్యంతో జాబితాలో తప్పులు దొర్లుతున్నాయని స్పష్టం చేశారు. వారి తప్పిదాలతో ఓటర్లు ‘రైట్ టు ఓట్’ అంశాన్ని కోల్పోతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, భారీగా ఓట్ల తొలగింపు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎఫ్‌డీ పేర్కొంది. ఒకే డోర్ నెంబర్‌పై వందలాది ఓట్ల నమోదు జరిగినట్లు తెలిసిందని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ఇటీవల కాగ్ నుంచి కూడా అభ్యంతరాలు వచ్చినట్లు సీఈవో దృష్టికి తీసుకెళ్లింది. ఓటర్ల జాబితాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది జోక్యాన్ని తప్పించాలని కోరింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కాకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశమే లేదని సీఎఫ్‌డీ పేర్కొంది. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై రాజకీయ నేపథ్య ఆరోపణలు ఉన్నాయని, ఈ క్రమంలో వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచాలని కోరింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉపాధ్యాయులకు అపార అనుభవం ఉందన్న సీఎఫ్‌డీ.. అనుభవం గల టీచర్లకు ఎన్నికల ప్రక్రియను అప్పగించాలని కోరింది.
* గత 48 గంటల్లోనే 31 మరణాలు చోటు చేసుకోవడంతో మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. దాంతో ఏక్‌నాథ్ శిందే సారథ్యంలోని శివసేన-భాజపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో శివసేన (Shiv Sena) ఎంపీ హేమంత్ పాటిల్ (Hemant Patil) మరణాలు సంభవించిన శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆస్పత్రి డీన్ శ్యామ్‌రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఆస్పత్రి డీన్‌తో ఎంపీ మరుగుదొడ్లు కడిగిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్ వైపర్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అందులో కనిపించారు. సోమవారం ఇదే ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మరణాలు సంభవించాయి. మంగళవారానికి ఆ సంఖ్య 31కి చేరింది. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఆస్పత్రి డీన్ శామ్‌రావ్ సోమవారం మాట్లాడుతూ మరణాలు చోటు చేసుకోవడానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని చెప్పారు. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని తెలిపారు.
* ప్రధాని మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు తప్పకుండా వస్తుందని మంత్రి కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా బాగా విజయవంతమవుతుందన్నారు. నిజామాబాద్ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆయన మాట్లాడారని చెప్పారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ఇకపై ఎవరైనా ప్రధాన మంత్రిని కలిస్తే సంభాషణను రికార్డు చేసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.
* మమ్మీ రూపంలో ఉన్న వ్యక్తి 1895 నవంబర్ 19న చనిపోయాడు. దొంగతనం కేసులో జైల్లోకి వచ్చిన అతడు అనారోగ్యంతో కన్నుమూశాడు. దాంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు జైలు అధికారులు ప్రయత్నించగా వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. విచారణలో అతడు నకిలీ పేరు చెప్పినట్లు తెలిసి విస్తుబోయారు. పోలీసులు మృతుడి కుటుంబీకుల కోసం వెతుకుతున్న సమయంలోనే మృతదేహం ఫ్యూనరల్ హోమ్‌కు చేరింది. ఎక్కువ రోజులు అక్కడే ఉంటే మృతదేహం కుళ్లిపోతుందనే ఉద్దేశంతో తమకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో దాన్ని అప్పటికప్పుడు మమ్మీగా మార్చేశారు. ఎంత వెతికినా మృతుడి కుటుంబీకుల వివరాలు తెలియకపోవడంతో దాన్ని మమ్మీగానే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఫ్యూనరల్ హోమ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తాము చేసిన ప్రయోగం ఎంత మేరకు విజయవంతం అయిందో తెలుసుకోవడానికి ఆ విజ్ఞప్తి చేసింది.
* కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఎయిర్‌బ్యాగ్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ అన్ని మోడల్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల (airbags)ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఇటీవలే తీసుకొచ్చిన భారత్ ఎన్‌క్యాప్ (Bharat New Car Assesment Programme- BNCAP) విధానంలో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నట్లు పేర్కొంది. కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చే కొత్త విధానమే ఈ భారత్ ఎన్‌క్యాప్. తొలుత మూడు మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల (airbags)ను అన్ని వేరియంట్లలో ప్రామాణికం చేస్తున్నట్లు హ్యుందాయ్ (Hyundai Motor India) తెలిపింది. దశలవారీగా దీన్ని ఇతర మోడళ్లకూ విస్తరించనున్నట్లు తెలిపింది. మరోవైపు తమ మిడ్ సైజ్ సెడాన్ వెర్నా కారుకు గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో అడల్ట్, చైల్డ్ విభాగంలో 5 స్టార్ రేటింగ్ లభించినట్లు తెలిపింది. ప్రయాణికులందరి భద్రత తమ తొలి ప్రాధాన్యమని హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్ తెలిపారు. రోడ్ నెట్‌వర్క్ విస్తరిస్తుండడం, స్పీడ్ లిమిట్స్ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను అప్‌గ్రేడ్ చేయడం తప్పనిసరని సీఓఓ తరుణ్ గార్గ్ అభిప్రాయపడ్డారు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సహా ఇతర కనెక్టెడ్ ఫీచర్లను అన్ని మోడళ్లకూ విస్తరించే యోచనలోనూ ఉన్నట్లు తెలిపారు.
* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయిందన్నారు. కేసీఆర్ దిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరతామని, తెలంగాణలో కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినట్లు చెప్పారు. అయితే, ఇది రాజరికం కాదని చెబుతూ, భారాసతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ రోజే తేల్చి చెప్పినట్లు మోదీ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఇందూరు గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భాజపా జనగర్జన సభలో ప్రసంగించారు.
* తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.
* తెలంగాణ సాధనలో భారాస (అప్పటి తెరాస) ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
* నిజామాబాద్ జిల్లాలోని ఇందూరులో భాజపా ఆధ్వర్యంలో జనగర్జన సభ జరుగుతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ సభ కావడంతో ప్రజలు, కార్యకర్తలు సభా స్థలానికి భారీగా చేరుకుంటున్నారు. దీంతో సభా ప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది. స్థలం లేక సభకు వచ్చే గేట్లను పోలీసులు మూసివేస్తున్నారు. ప్రాంగణం బయట ఉన్న ప్రజలను పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. స్థలం లేకపోవడంతో ప్రజలు రాకుండా పోలీసులు బైపాస్ రోడ్డును మూసివేశారు.
* అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది.