Movies

రణబీర్ మెడకు బెట్టింగ్ యాప్ ఉచ్చు

రణబీర్ మెడకు బెట్టింగ్ యాప్ ఉచ్చు

మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్‌ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిద్ధమయ్యినట్లు ప్రచారం జరగ్గా అదే నిజమైంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. మహాదేవ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌కు రణ్‌బీర్‌ ప్రచారకర్తగా వ్యవహరించాడు. తాజాగా అతడికి నోటీసులు జారీ చేసిన ఈడీ అక్టోబర్‌ 6న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా సౌరభ్‌ చంద్రకర్‌, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోని ఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. ఈ పెళ్లికి ఆయన ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. బంధువులను, సెలబ్రిటీలను దుబాయ్‌ తీసుకొచ్చేందుకు ‍ప్రైవేట్‌ జెట్స్‌ సైతం ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన చెల్లింపులను హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు ఈడీ షాక్‌ ఇవ్వనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. బాలీవుడ్ పెద్దలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మహాదేవ్ బుక్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల్లో ఈడీ విచారణ జరుపుతోంది.