Movies

కరుణానిధి సంభాషణలకు బెదిరిపోయిన రజనీ

కరుణానిధి సంభాషణలకు బెదిరిపోయిన రజనీ

కరుణానిధి శతజయంతిని పురస్కరించుకుని మురసోలి దినపత్రికలో రజనీకాంత్‌ వ్యాసం రాశారు. అందులో.. ‘‘1980లో ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. ఆ చిత్రానికి సంభాషణలు రాసేందుకు కరుణానిధి ఒప్పుకొన్నారని నిర్మాత చెప్పడంతో నాకు కంగారు పుట్టింది. సాధారణ తమిళం మాట్లాడటానికే కష్టపడుతున్న నేను ఏకంగా కరుణానిధి సంభాషణలు మాట్లాడుతూ నటించడం అసాధ్యం అనుకున్నాను. అందుకు బదులు కర్ణాటకకు వెళ్లి బస్సులో టికెట్లు కొట్టొచ్చని అనిపించింది. కరుణానిధి సంభాషణలు రాస్తే నటించలేనని, ఆయన్ను కలిసే అవకాశం కల్పిస్తే ఆ విషయం విన్నవిస్తానని చెప్పాను. నిర్మాత అయిష్టంగా అంగీకరించి గోపాలపురంలో కరుణానిధిని కలిసే ఏర్పాటు చేశారు. సాధారణ తమిళం మాట్లాడటానికే ఇబ్బంది పడుతున్నానని, మీ సంభాషణలు ఎలా మాట్లాడగలనని అన్నాను. అది అసాధ్యమని, తప్పుగా భావించొద్దని విజ్ఞప్తి చేశాను. అందుకు ఆయన నవ్వుతూ, సంభాషణలు ఎవరికెలా రాయాలో తనకు తెలుసన్నారు. ఎంజీఆర్‌కు రాసినట్టు శివాజీ గణేశన్‌కు రాయనని, శివాజీ గణేశన్‌కు రాసినట్టు ఎంజీఆర్‌కు రాయనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నా మౌనాన్ని అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అనుకోను. ఇంతకుముందు సినిమాలకు ఎవరు సంభాషణలు రాశారో వారినే రాయనీ అని చెప్పారు. తర్వాత నిర్మాతను పిలిపించి చిత్రీకరణ ఈ నెల పదో తేదీ అంటున్నారే, నేను వచ్చే నెల అనుకుని సంభాషణలు రాయడానికి ఒప్పుకొన్నాను. అలాగైతే నాకు సాధ్యపడదు. తర్వాతి సినిమాకు చూద్దామంటూ సున్నితంగా తిరస్కరించారు. తర్వాత నన్ను చూసి సంతోషమా అని అడిగారు. నిర్మాతను నొప్పించకుండా నన్నూ సంతోషపరిచారు’’ అంటూ గత స్మృతులను పంచుకున్నారు.