DailyDose

ర్యాగింగ్ పేరిట తెలంగాణా విద్యార్థి హత్య-నేరవార్తలు

ర్యాగింగ్ పేరిట తెలంగాణా విద్యార్థి హత్య-నేరవార్తలు

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development case) అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను రెండు వారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

* గుంటూరులోని ఎల్ఐసీ కాలనీలో ఓ వివాహితపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మధుకుమారి అనే మహిళ తన కుమారుడిని పాఠశాలలో వదిలి స్కూటీపై వస్తుండగా.. ఆమెను నలుగురు దుండగులు అడ్డగించారు. స్కూటీ ఆపగానే ఆమెపై కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా పొడవటంతో మధుకుమారి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగులు అక్కడి నుంచి బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని జీజీహెచ్‌కు తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో తన భర్తతో విబేధాలు ఉండేవని, ఇప్పుడు కలిసే ఉంటున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. దాడి చేసిన వారెవరో తెలియదని చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని బసవతారకనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను వేధిస్తున్నాడనే అనుమానంతో తమ్ముడు సాజిద్‌ను అన్న షబ్బీర్‌ అహ్మద్‌ దారుణంగా నరికి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు గల కారణాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. సాజిద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు షబ్బీర్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

* హైద‌రాబాద్ న‌గ‌రంలోని సైదాబాద్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఉద్రిక్త‌త నెల‌కొంది. శివ‌శ‌క్తి బార్ స‌మీపంలోని హైటెన్ష‌న్ స్తంభాన్ని ఓ గుర్తు తెలియ‌ని యువ‌కుడు ఎక్కి హంగామా సృష్టించాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఆ వ్య‌క్తిని విద్యుత్ స్తంభం నుంచి కింద‌కు దింపేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. హైటెన్ష‌న్ స్తంభం ఎక్కిన వ్య‌క్తి వివ‌రాలు తెలియరాలేదు. అస‌లు అత‌ను ఎందుకు విద్యుత్ స్తంభం ఎక్కాల్సి వ‌చ్చింది..? ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడ‌నే వివరాలు తెలియాల్సి ఉంది.

* ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

* మంచిర్యాల జిల్లాలో మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్‌లో కామెర ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. వేధిస్తూ, దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.