Business

5లక్షల యాపిల్ షేర్లు అమ్మేసిన టిమ్-వాణిజ్యం

తన 5లక్షల యాపిల్ షేర్లు అమ్మేసిన టిమ్-వాణిజ్యం

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీల్లో రెండు రోజల వరుస నష్టాలకు గురువారం తెరపడింది. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. చమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పరిణామాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. దీనికి ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు కూడా జతయ్యాయి. మరోవైపు గతకొన్ని రోజులు మార్కెట్లు స్థిరీకరణ దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 65,598.26 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,753.20 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 405.53 పాయింట్ల లాభంతో 65,631.57 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,521.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,576.95 దగ్గర ఎగువ స్థాయికి చేరుకుంది. చివరకు 109.65 పాయింట్లు లాభపడి 19,545.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.29 వద్ద నిలిచింది.

* పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడంలో ముందువరుసలో నిలిచే సింగరేణి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న హైడ్రోజన్‌ ప్లాంట్‌ను గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌గా మార్చడంతోపాటు, రామగుండం రీజియన్‌లో ఒక గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు అవకాశాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆదేశించారు. ఇప్పటికే 224 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను పర్యావరణహితంగానిర్వహిస్తున్న సంస్థ… హైడ్రోజన్‌ను కూడా ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో వినియోగించేందుకు కావాల్సిన హైడ్రోజన్‌ను ఇకపై సౌర విద్యుత్తును వినియోగిస్తూ ఉత్పత్తి చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రస్తుత ప్లాంట్‌లో తక్షణం చేయాలని ఆదేశించారు.

* ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దూసుకుపోతున్నది. దేశవ్యాప్తంగా గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.48 వేల కోట్ల గృహ రుణాలు మంజూరు చేసింది.

* ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైంది. మరోవైపు కార్తీక మాస పెండ్లిండ్ల సీజన్ రాబోతున్నది. గతంలో పండుగలు.. పెండ్లిండ్ల సీజన్‌లో బంగారం ధరలు పెరిగేవి. కానీ ప్రస్తుతం గ్లోబల్, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పూర్తిగా దిగి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజుల్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.2950 దిగి వచ్చింది. బుధవారం (అక్టోబర్ 4) తులం బంగారం రూ.57,300 వద్ద ముగిసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.190 తగ్గి రూ.52,590 పలికింది. 24 క్యారట్స్ తులం బంగారం రూ.210 పతనమై రూ.57,370 వద్ద నిలిచింది. ఢిల్లీలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం (గురువారం, అక్టోబర్ 5) రూ.200 తగ్గి రూ.52,550 పలికింది. సెప్టెంబర్ ఐదో తేదీన ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60,300 (సెప్టెంబర్ నాలుగో తేదీన రూ.60,450) పలికితే, గురువారం రూ.57,350కి దిగి వచ్చిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా ధరలు దిగి వస్తున్నాయని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.300 పెరిగి రూ.71,300 వద్ద స్థిర పడింది.

* యాపిల్ కంపెనీ సీఈఓ ‘టిమ్ కుక్’ (Tim Cook) ఇటీవల తన షేర్లలో భారీ భాగాన్ని విక్రయించి, గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద విక్రయాన్ని నమోదు చేసుకున్నాడు. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, కుక్ 5,11,000 షేర్లను (శుక్రవారం 2,70,000 షేర్లు, సోమవారం 2,41,000 షేర్లు) విక్రయించి దాదాపు 41.5 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 345 కోట్లు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం, అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 88 మిలియన్ డాలర్లు, మొత్తం టాక్స్ తరువాత అతనికి 41.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు తరువాత కుక్ విక్రయించిన అతిపెద్ద ఆపిల్ షేర్లు ఇవే కావడం గమనార్హం. టిమ్ కుక్ తన యాపిల్ షేర్లలో కొన్నింటిని విక్రయించినప్పటికీ, తన వార్షిక ప్రణాళికలో భాగంగా అతను అదే సంఖ్యలో షేర్లను అందుకోవడం వల్ల కంపెనీలో అతని మొత్తం వాటా మారలేదు. ఇప్పటికి కూడా ఇతడు 3.3 మిలియన్ యాపిల్ షేర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం సుమారు 565 మిలియన్ డాలర్లు.