* ఉత్తర కుమారుడు లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశామని చెబుతున్నాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఫ్యామిలీ అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ఎక్కడున్నాడు? లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్ ఎక్కడున్నాడు?. ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారు?. మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య. చంద్రబాబు, పవన్‌లే ఏపీకి పట్టిన మహమ్మారి. పవన్…చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకం చెప్పు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కొల్లేరుకు ఏం చేశారు?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
* రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూ ఘాటు విమర్శలు చేశారు. జనసేన అధినేత ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ చురకలంటించారు. కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అవినీతి, అక్రమాల పుట్ట. చంద్రబాబు లాయర్లు 17A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చట్ట విరుద్ధమంటున్నారు. రాష్ట్ర ఖజానా దోచుకున్న దొంగ చంద్రబాబు. ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని వాదిస్తున్నారు. సెక్షన్ 17A రాకుండానే నమోదైన కేసు ఇది. చంద్రబాబు 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయే సరికి కమీషన్లకు కక్కుర్తి పడేవాడు. 2014లో లోకేష్ ఎంటరయ్యాక దొంగ అకౌంట్లకు ప్రభుత్వ సొమ్ము తరలించి విచ్చలవిడిగా దోచేశారు. చంద్రబాబు అవినీతి చేయలేదని కాకుండా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గుచేటు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420. చంద్రబాబు, టీడీపీ ఎన్ని డ్రామాలు చేసినా.. గరిటెలు, పళ్లాలు కొట్టినా ప్రజలు క్షమించరు. చంద్రబాబు లోపలుంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఎవరికి పనికొస్తాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
* భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కెనడా స్పందించింది. తమ దౌత్య వేత్తలను భారత్ నుంచి ఖాలీ చేయించింది. సింగపూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు పరిణామాల అనంతరం దౌత్యవేత్తల సంఖ్యను సమానంగా ఉంచాలని భారత్ కోరిన నేపథ్యంలో కెనడా ఈ మేరకు చర్యలు తీసుకుంది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య వేత్తలను దాదాపు 40 మంది వరకు బయటకు పంపించాలని భారత్ కెనడాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరుదేశాల్లో దౌత్య వేత్తలు సమాన సంఖ్యలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్టోబర్ 10 నాటికి చివరి గడువును విధించింది. అప్పటికీ ఖాలీ చేయకపోతే.. రక్షణను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ ఘాటుగా స్పందించింది. అయితే.. కెనడా దౌత్య వేత్తలు ఎంత మంది భారత్‌ను వీడారనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ వారిని మాత్రం సింగపూర్‌కు తరలించినట్లు కెనడాకు చెందిన ఓ మీడియా కథనం వెల్లడించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
* ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 40కి చేరుకోగా.. వారిలో 22 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఈ నేపథ్యంలో వరదలపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసి రకం నిర్మాణం కారణంగా సిక్కింలోని చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. కాగా, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదు. ఫలితంగా ఇది కొట్టుకుపోయింది. రాష్ట్రం ఉత్తరభాగంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. క్లౌడ్ బర్ట్సింగ్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్ పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 1200 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కూడా వరదల కారణంగా కొట్టుకుపోయినట్టు స్పష్టం చేశారు. ఇది సిక్కిం రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి. తీస్తాపై 13 వంతెనలు కొట్టుకుపోయాయని తమాంగ్ వివరించారు.
* కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం ఎదురైంది. తన మద్దతుదారులను కలవడానికి వచ్చిన ట్రూడోపై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెనడాను నాశనం చేస్తున్నావంటూ ట్రూడోను ఉద్దేశించి ఆరోపించాడు. దేశంలో హౌజింగ్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని వాపోయాడు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిన్ ట్రూడో తన మద్దతుదారులను కలవడానికి వచ్చారు. ఓ చిన్నపిల్లాడికి షేక్యాండ్ ఇచ్చి మరో వ్యక్తి వద్దకు వెళ్లాడు. ఆ వ్యక్తి షేక్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ట్రూడోపై విమర్శలు కురిపించాడు. కెనడాలో హౌజింగ్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం మీరే అంటూ ట్రూడోను నిలదీశాడు. ట్రూడో కలగజేసుకుని.. ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలదని సమాధానమిచ్చాడు. ఇంతలో ఓ వ్యక్తి ట్రూడోను మరో సమస్యను లేవనెత్తాడు. దేశంలో కార్బన్‌కు కూడా ట్యాక్స్ విధిస్తున్నారంటూ మండిపడ్డాడు. సమాధానమిచ్చిన ట్రూడో.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అంటూ బదులిచ్చారు.
* తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీల నేతలు గెలుపు తమదంటే తమదేనని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా నకిరేకల్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి, మధు యాష్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు. కానీ, కాంగ్రెస్‌లో అలా కాదు.. ఎవరైనా సీఎం కావొచ్చు. తెలంగాణలో ఎవరు సీఎం అన్నది ముఖ్యం కాదు. ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడం అందరిముందున్న లక్ష్యం. నేను భవిష్యుత్తులో ఎప్పుడైనా సీఎం అవుతాను అంటూ కామెంట్స్ చేశారు.
* ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం న్యాయమూర్తి.. తీర్పును రిజర్వులో పెట్టారు. సీఐడీ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దూబే తమ వాదనలు వినిపించారు. పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరపనుంది.
* ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు.
* సింగపూర్‌కి చెందిన హౌ జుయోనీ హెర్మియోన్‌కు మెటాలో ఉద్యోగం సంపాదించింది. వైరస్ సోకుతుందేమోనన్న భయంలోనూ ఉద్యోగం దొరికిందన్న ఆనందం రెట్టింపైంది. అందులోనే ప్రాజెక్ట్ సోర్సింగ్ మేనేజర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో మెటా వర్క్ ఫోర్స్‌ని తగ్గిస్తూ తొలగిస్తూ ప్రకటించింది. వారిలో హెర్మియోన్ కూడా ఉన్నారు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నందుకు విచారం వ్యక్తం చేయక పోగా.. లేఆఫ్స్‌కు గురైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. అందుకు కారణం.. ఆమెకు తన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవడమేనని తెలుస్తోంది.
* అవినీతిని ప్రశ్నించినందుకే తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. ప్రభుత్వ తప్పులు బయటపెట్టి.. ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెట్టారు. 28 రోజులుగా రిమాండ్‌లో పెట్టారు. స్కిల్ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అని చెప్పారు. అనంతరం రూ.300 కోట్లు అని ఆరోపించారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్‌కు పంపారు.’’ అని అన్నారు.
* ఉక్రెయిన్‌పై అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ (Republican) అభ్యర్థిత్వ పోటీదారు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) వైఖరిని నిరసిస్తూ కొందరు దాడికి యత్నించారు. కొందరు నిరసనకారులు తన కాన్వాయ్‌లోని వాహనంపై దాడి చేసేందుకు ప్రయత్నించారని వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఆరోపించారు. అయోవాలోని గ్రిన్నెల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, వివేక్ రామస్వామి ఆరోపణలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
* మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయమూర్తులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగే వాదనలను నిరాకరించకూడదని పేర్కొంది. బార్ సభ్యులకు హైబ్రిడ్ సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించింది. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సు విచారణలు పూర్తిగా నిలిచిపోయాననే పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ కీలక సూచన చేసింది. గత విచారణలో ఈ అంశంపై సుప్రీం కోర్టు అన్ని హైకోర్టులు, ట్రిబ్యునళ్లకు నోటీసులు పంపించింది.
* రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఐఏఎస్‌లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘‘ వేతనాలు రాక ఒప్పంద ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా ఐఏఎస్‌లకు జీతాలు వస్తాయి. ఐఏఎస్‌ల జీతాలు మళ్లించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగ ఉల్లంఘన వైకాపా నేతలకు సహజ గుణంగా మారింది. అసమర్థ ప్రభుత్వ పాలనతో సమస్యలు లేవనెత్తితే దాడులు చేస్తున్నారు. సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. కేసులు వాయిదా వేయించుకోవడానికి సీఎం జగన్, ఎంపీలు దిల్లీకి వెళ్తున్నారా? వైకాపా అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
* అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్ట్‌డిస్నీ (Disney India) తన భారత టెలివిజన్, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. భారత వ్యాపారాన్ని విక్రయించేందుకు గతంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డిస్నీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ (Adani group), కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ నెట్‌వర్క్‌తో (Sun tv) సైతం డిస్నీ చర్చలు జరుపుతున్నట్లు ‘బ్లూమ్‌బెర్గ్’ తెలిసింది. దేశంలో అతిపెద్ద బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీల్లో ఒకటైన సన్‌టీవీ నెట్‌వర్క్ గనుక డిస్నీ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంస్థకు ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉందని, అదే ఎన్డీటీవీ కొనుగోలు ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గనుక ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంస్థ వ్యాపార విస్తరణకు దోహదపడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, డీల్ అప్పుడే ఓ కొలిక్కి రాకపోవచ్చని తెలిపాయి.