Fashion

దసరా తర్వాత భారీగా పెళ్లి సందడి

దసరా తర్వాత భారీగా పెళ్లి సందడి

దసరా తరువాత నుంచి ఆరు నెలల పాటు బాజా భజంత్రీలు, పెళ్లిసందడితో తెలుగు రాష్ట్రాలు హోరెత్తనున్నాయి. విజయదశమి తరువాత దాదాపు రెండు నెలల పాటు పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండటంతో పిల్లల వివాహాలకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబరు మూడో వారం నుంచి సంక్రాంతి వెళ్లే వరకు పెళ్లి ముహూర్తాలు ఉండవు. తరువాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే ముహూర్తాలున్నాయి. మళ్లీ 2024 మే నెల నుంచి అక్టోబరు వరకు ముహూర్తాలు లేనందున మ్యారేజిబ్యూరోల ప్రతినిధులు, పెళ్లిళ్ల పేరయ్యలు తల్లిదండ్రులను తొందరపెడుతున్నారు. ఈసారి మాఘమాసం (ఫిబ్రవరి) తరువాత.. మళ్లీ నవంబరులో వచ్చే కార్తీకమాసం వరకూ శుభముహూర్తాలు లేవని రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు వి.విజయకృష్ణ ‘ఈనాడు’కు చెప్పారు. ఉగాది పండగ తరువాత కొత్త పంచాంగం వస్తుందని, దాన్నిబట్టి ముహూర్తాలు ఏ తేదీల్లో ఉన్నాయనే సమాచారం మరింత పక్కాగా తెలుస్తుందని చెప్పారు. ఈ నెల 23న దసరా తరువాత నుంచి కార్తీకం, తరువాత మార్గశిరం, ఫిబ్రవరిలో వచ్చే మాఘమాసం వరకు మంచి ముహూర్తాలున్నాయని, ఈ నెలల్లో పెళ్లిళ్లు చేసుకోవడం ఉత్తమమని ఆయన వివరించారు.

దొరకని ఫంక్షన్‌ హాళ్లు.. మారుతున్న ముహూర్తాలు….పెళ్లిళ్లతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున ఫంక్షన్‌హాళ్లకు విపరీతమైన డిమాండు పెరిగింది. తెలంగాణలోని ఫంక్షన్‌హాళ్లన్నీ నవంబరు నెలకు ముందే బుక్‌ అయిపోయాయి. ఎన్నికల ప్రచార సభలు, కులసంఘాల సభల కోసం స్థానిక నేతలు కూడా ఫంక్షన్‌హాళ్ల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఒక అమ్మాయి పెళ్లికి పురోహితుడు నవంబరులో మూడు ముహూర్తాలు సూచించారు. కానీ ఆ తేదీల్లో చుట్టుపక్కల ఎక్కడా ఫంక్షన్‌హాళ్లు ఖాళీ లేవు. చివరికి ఒక ఫంక్షన్‌హాలు ఖాళీగా ఉన్న తేదీనే పెళ్లి చేయడానికి.. ఆ ముహూర్తానికి అనుగుణంగా అమ్మాయి పేరును మార్చారు. డిమాండును ఆసరా చేసుకుని ఫంక్షన్‌హాళ్ల కిరాయిలు 50 నుంచి 80 శాతం వరకు పెంచేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పురోహితులు, వంట మనుషులు దొరకడం కూడా కష్టంగా మారింది. ఫిబ్రవరి, మార్చిలో పెళ్లిళ్లకు కూడా ఇప్పుడే ఫంక్షన్‌హాళ్లు, పురోహితులను ముందస్తుగా మాట్లాడుకుంటున్నారు.

ఎన్నారై యువత హైరానా….విదేశాల్లో ఉన్న తెలుగు యువతీ యువకులు కూడా పెళ్లి ముహూర్తాలు చూసుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే మార్చికల్లా పెళ్లి జరిపించేలా సంబంధాలు చూడాలని పలువురు ఎన్నారైల తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారని హైదరాబాద్‌, విజయవాడలకు చెందిన మ్యారేజిబ్యూరోల ప్రతినిధులు ఒకరు చెప్పారు. డిసెంబరులో అమెరికాలో క్రిస్మస్‌ సెలవులు అధికంగా ఉంటాయి కనుక.. ఆ సమయానికి నిశ్చితార్థం లేదా పెళ్లి చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.