స్విట్జర్లాండ్‌కు చెందిన భారీ విద్యుత్ ఉపకరణాల దిగ్గజం హిటాచీ ఎనర్జీ, మన దేశంలో అశోక్ లేలాండ్‌తో కలిసి ఫ్లాష్-ఛార్జింగ్ వ్యవస్థ అభివృద్ధిపై పని చేస్తోంది. విద్యుత్ బస్సులకు అత్యంత వేగంగా 20 సెకన్లలోనే ఛార్జింగ్ అయ్యే సాంకేతికతను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. చెన్నై ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లోని 2 ఛార్జింగ్ స్టేషన్లలో ఆపరేషనల్ టెస్టింగ్‌లో కంపెనీ నిమగ్నమైంది. ఈ సాంకేతికత అభివృద్ధి తుది దశలో ఉందని, దీన్ని స్థానికీకరించి, అంతర్జాతీయంగానూ విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది. ‘ఫ్లాష్ ఛార్జింగ్‌తో ఇ-బస్సులను బస్టాపుల్లో ఆపినప్పుడు, సత్వరం ఛార్జింగ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు బస్సు ఎక్కేలోపు ఛార్జింగ్ పూర్తవుతుంది. ఎక్కువ మంది ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు కూడా అవకాశం లభిస్తుంది. 20 సెకన్లలోపే ఛార్జింగ్‌తో బస్సులు మళ్లీ తగ్గిన లోడ్‌ను భర్తీ చేసుకుంటాయ’ని హిటాచీ ఎనర్జీ (భారత్, ఎస్‌ఈ ఆసియా) ఎన్.వేణు వెల్లడించారు. ప్రయోగాత్మక దశలోనే ఈ సాంకేతికత ఉందని, మరికొన్ని నెలల్లో దీన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నామని ఆయన తెలిపారు.