తన కుమారులు ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్న హామీ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అలిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్, మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జునసాగర్ టికెట్ మాత్రమే ఇస్తామని అధిష్ఠానం ఆయనకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయన అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, అతని కుమారుడు రోహిత్‌కు రెండు టికెట్లపై హామీ లభించింది. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతికి, కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి రెండు టికెట్లపై హామీ లభించినట్టు తెలిసింది. కానీ, తన కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వజూపడంతో జానారెడ్డి పార్టీ కార్యక్రమాల్లోనూ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాలుగా పని చేస్తున్న తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినట్టు సమాచారం. ఒకవేళ అధిష్ఠానం ఒకే టికెట్‌కే కట్టుబడి ఉంటే జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.