NRI-NRT

London: భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు: కవిత

భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు

భారతదేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చిన‌ నేపథ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారత్ ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందని చెప్పారు. లండన్‌లోని పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలవుతున్నాయని, స్థానిక పరిపాలనలో మహిళల భాగస్వామ్యం దాదాపు 57 శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవుల్లో దాదాపు 55-57 శాతం మంది మహిళలే ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. వారిలో 92 శాతం మంది తమ పార్టీకి చెందినవారేనని అన్నారు.