ScienceAndTech

Child Abuse: ఒక్కరోజులో 2114 గ్రూపులపై టెలీగ్రామ్ నిషేధం

Child Abuse: ఒక్కరోజులో 2114 గ్రూపులపై టెలీగ్రామ్ నిషేధం

బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని తొలగించాలంటూ కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ (Telegram) చర్యలు చేపట్టింది. అక్టోబర్‌ 6న ఒక్కరోజే 2114 గ్రూపులు, ఛానెళ్లను బ్యాన్‌ చేసినట్లు తెలిపింది. ఈ నెలలో మొత్తం 10,312 గ్రూప్స్‌, ఛానెళ్లపై నిషేధం విధించినట్లు కంపెనీ తెలిపింది. బాలల లైంగిక వేధింపుల సమాచారాన్ని భారత్‌లోని తమ వేదికల్లో వెంటనే తొలగించాలంటూ సామాజిక మాధ్యమాలైన ట్విటర్‌, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తాఖీదులు జారీ చేసింది. భవిష్యత్‌లోనూ అలాంటి విషయాలు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సదరు సమాచారం వెంటనే తొలగించకపోతే.. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 కింద ఆయా సామాజిక మాధ్యమాలకు కల్పిస్తున్న రక్షణను ఉపసంహరించుకుంటామని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన టెలిగ్రామ్‌.. చట్టపరమైన, నైతిక విలువలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపింది. ముఖ్యంగా చైల్డ్‌ పోర్నోగ్రఫీ, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం వంటి విషయాల్లో ఐటీ చట్టం నిబంధనలు తప్పక పాటిస్తామని టెలిగ్రామ్‌ తెలిపింది. కేవలం 10-12 గంటల్లోనే సంబంధిత కంటెంట్‌ను తొలగిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక టీమ్‌ కూడా పనిచేస్తోందని పేర్కొంది. ఇటువంటి కంటెంట్‌ సర్క్యులేషన్‌ను అడ్డుకోవడానికి, తొలగించడానికి ఆటోమేటెడ్‌ బాట్‌ వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు టెలిగ్రామ్‌ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కీవర్డులు, టెక్ట్స్‌, పిక్చర్స్‌, వీడియోలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.