Business

పిండిపై జీఎస్టీ తగ్గింపు-వాణిజ్యం

పిండిపై జీఎస్టీ తగ్గింపు-వాణిజ్యం

* ఎయిరిండియా (Airindia)ను కొనుగోలు చేసిన నాటి నుంచి దాని అభివృద్ధిలో భాగంగా వివిధ మార్పులకు శ్రీకారం చుడుతున్న టాటా గ్రూప్‌.. ఇటీవల సంస్థ లోగో (Logo), ఎయిర్‌క్రాఫ్ట్‌ లివరీ (విమానాల రూపు)లో మార్పులు చేసింది. ఈ నయా లుక్‌లోకి మారిన విమానాల ఫస్ట్‌ లుక్‌ను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఫ్రాన్స్‌లోని టౌలోసి వర్క్‌షాప్‌లో కొత్త లోగో, డిజైన్‌తో సరికొత్తగా తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను ఎయిరిండియా తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ శీతాకాలానికి ఏ350 విమానాలను స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

* తమ యూజర్లకు నచ్చిన ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకునేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) అవకాశం కల్పిస్తోంది. రీఛార్జి ప్లాన్‌ అనుగుణంగా వీఐ అందించే ఎంపికల్లో నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకొనే సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, కేవలం పోస్ట్‌ పెయిడ్‌ (postpaid) కస్టమర్లు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది.

* మిల్లెట్ల పిండిపై జీఎస్టీని (GST) తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ (GST Council) నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్‌ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇంతకుముందు దీనిపై జీఎస్టీ 18 శాతంగా ఉండేది. కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని లూజుగా విక్రయిస్తే.. ఎలాంటి జీఎస్టీ వర్తించదని చెప్పారు. మిల్లెట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలో జరిగిన 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్‌ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు.

* రూ.2000 విలువైన నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌కు గడువు శనివారంతో ముగిసిపోనున్నది. ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో రూ.12 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. అవి ఇంకా బ్యాంకులకు చేరలేదు. తొలుత సెప్టెంబర్ 30 వరకూ రూ.2000 నోట్ మార్పిడి లేదా డిపాజిట్‌కు అవకాశం ఇచ్చిన ఆర్బీఐ.. తర్వాత గడువు ఈ నెల ఏడో తేదీకి పొడిగించింది. కానీ, మరో రూ.12 వేల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లోనే చలామణిలో ఉన్నాయని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. సోమవారం నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద మాత్రమే మార్చుకునేందుకు వీలు ఉందని కూడా శక్తికాంత దాస్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఆర్బీఐకి 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20 వేల వరకూ డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పోస్టాఫీసుల ద్వారా కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపవచ్చు. అలా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపిన వారి బ్యాంకు ఖాతాలో ఆ నోట్ల విలువ సొమ్ము క్రెడిట్ అవుతుంది.

* దేశీయ వంటనూనెల దిగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 33 శాతం ఎగిశాయి. ఏకంగా 18.52 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ స్థాయిలో నెలవారీ దిగుమతులు లేకపోవడం గమనార్హం. ఇక ఆహారేతర విజిటబుల్‌ ఆయిల్స్‌తో కలిపి చూస్తే ఈ ఆగస్టు దిగుమతులు 18.66 లక్షల టన్నులుగా ఉన్నాయి. అయితే దేశీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయిందని, దిగుమతి సుంకాలు కూడా తక్కువయ్యాయని, దీంతో ఆయా దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగిపోయాయని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) తెలిపింది. కాగా, ఈసారి ఆగస్టు దిగుమతుల్లో పామాయిల్‌ వాటానే 11.28 లక్షల టన్నులుగా ఉన్నది. రకరకాల విత్తనాలు, పండ్లు, గింజల నుంచి తీసే నూనెలనే వెజిటబుల్‌ ఆయిల్స్‌ అంటున్నది తెలిసిందే.

* బంగారం ధర భారీగా తగ్గడంతో గోల్డ్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆ సంతోషం 24 గంటలు కూడా గడవకముందే బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితే నిన్న తగ్గిన ధరతో పోల్చితే నేడు పెరిగిన ధర తక్కువగానే ఉండడం సంతోషించే అంశం. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 100 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 70 పెరిగింది. దీంతో దేశంలో శనివారం 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 52,500కి చేరుకోగా 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.