తెలంగాణలో నడిచే నాలుగు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలును పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్ల పొడిగింపు అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
పొడిగించిన రైళ్లు ఇవే..
జైపూర్ నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న జైపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ (919713/19714)ను ఏపీలోని కర్నూలు వరకు పొడిగించారు. ఈ రైలు తెలంగాణలోని గద్వాల, మహబూబ్నగర్, షాద్నగర్ లోనూ ఆగనుంది.
హైదరాబాద్- హడప్సర్ (పూణె) ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు (17013/17014) భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు.
హెచ్ఎస్ నాందేడ్ – తాండూరు – పర్భణీ ఎక్స్ప్రెస్ రైలు(17664/17663)ను సేడం, యాద్గిర్ మీదుగా రాయచూరు వరకు పొడిగించారు
కరీంనగర్ – నిజామాబాద్ మధ్య నడిచే – కరీంనగర్ ప్యాసింజర్ (07894/07893)ను బోధన్ వరకు పొడిగించారు.
ALSO READ : అక్టోబర్ 14 వరకు..ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..
ఈ పొడిగింపులు అక్టోబర్ 9 2023 నుండి అమలులోకి వస్తాయి. అక్టోబర్ 8వ తేదీ ఆదివారం నుంచి పొడిగించిన రైలు సర్వీసుల ముందస్తు రిజర్వేషన్ బుకింగ్ మొదలైంది. అక్టోబర్ 9వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ రైళ్ల పొడిగింపును ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.