కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దొరకడం లేదు. దీంతో వారు తీవ్ర ఆందోళనలకు లోనవుతున్నారు. 2022లో 2,26,450 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కెనడాకు చేరుకున్నారు. ‘భారత్-కెనడాల మధ్య చోటుచేసుకున్న పరిణామాల కంటే నా భవిష్యత్తు మీదే నాకు ఆందోళన. ఇక్కడ తీవ్రమైన ఉద్యోగాల కొరత. నా ఉన్నత విద్య పూర్తయ్యేసరికి నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియడంలేదు’ అని ఓ భారతీయ విద్యార్థి వాపోయాడు. టొరంటోలోని అనేక మంది భారత విద్యార్థులది ఇదే పరిస్థితి. ”వైద్య పట్టాలు పొందిన భారతీయ విద్యార్థుల దుర్భర పరిస్థితి నాకు తెలుసు. వారికి మంచి జీతాలిచ్చే ఉద్యోగాలు దొరకడం లేదు. ఈ విధంగా అనేక మంది క్యాబ్‌లు నడుపుతూ, దుకాణాలు, రెస్టారెంట్లలో పనిచేస్తూ తమ బిల్లులు కట్టుకుంటున్నారు’’ అని మరో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి తోడు టొరంటో దాని చుట్టుపక్కల నగరాల్లో ఉండే అత్యధిక జీవన వ్యయ పరిస్థితులు విద్యార్థులకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయి. దీనితో ఎక్కువ మంది నెలవారీ ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇరుకైన గదుల్లో కాలం గడుపుతున్నారు