Movies

అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన జగపతి బాబు

అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన జగపతి బాబు

అభిమానుల ప్రవర్తనతో అసహనానికి గురయ్యారు నటుడు జగపతి బాబు (Jagapathi Babu). దీంతో తాను ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇకపై అభిమాన సంఘాలకు తాను దూరంగా ఉంటున్నట్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

‘‘33 ఏళ్ల నా సినీ కెరీర్‌లో అభిమానులు నా ఎదుగుదలకు ముఖ్య కారణం అని భావించా. వాళ్ల కష్టాలను నా కష్టాలుగా భావించి అన్నివిధాలుగా నీడగా నిలిచా. అభిమానులంటే ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మా. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువైంది. నన్ను ఇబ్బందిపెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు అంగీకరించకపోయినా బాధతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుంచి నా అభిమాన సంఘాలు, ట్రస్ట్‌లకు నాకూ ఎలాంటి సంబంధం లేదు. వాటి ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నా. అయితే, కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటా’’ అని పోస్ట్ పెట్టారు. అయితే, జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’, ‘సలార్‌’ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు.