కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆదివారం దిల్లీలో ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఓ మద్యం దుకాణంలో జరిగిన విక్రయాలను పరిశీలిస్తే.. రూ.లక్ష వరకు చేపట్టిన విక్రయాల్లో కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్ చెల్లింపులైనట్లు గుర్తించామని పురందేశ్వరి ఇటీవల మీడియాకు తెలిపారు. ప్రతి రోజూ మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనధికారికంగా వైకాపా నేతల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రజల జేబుల నుంచి డబ్బులు దోచుకుని ఉచితాలు ఇస్తున్నామనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం శోచనీయమని పేర్కొన్నారు.