Agriculture

అంతరిక్షంలో వ్యవసాయం సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు

అంతరిక్షంలో వ్యవసాయం సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు

ఇటీవల అంతరిక్ష ప్రయోగాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. చంద్రయాన్ -3 తర్వాత ప్రపంచ దేశాలన్నీ మరింత ఆసక్తితో ఇతర గ్రహాల ఉనికిపై ఫోకస్ పెట్టాయి. ఆయా దేశాల్లోని స్పేస్ ఏజెన్సీలు ప్రత్యేక ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో థాయ్‌లాండ్‌లోని మహిడోల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఒక సరి కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఏంటంటే.. భవిష్యత్తులో అంతరిక్షంలోని ఆయా గ్రహాలకు వ్యోమగాములు వెళ్లినప్పుడు, అక్కడ తమకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ అందించగల అద్భుతమైన ఒక పుష్పించే మొక్క భూమిపై ఉన్నట్లు కనుగొన్నారు. ‘వాటర్ మీల్’ అని పిలువబడే ఈ మొక్క దాని గురుత్వాకర్షణ శక్తిలోని ప్రత్యేకతల రీత్యా ఆయా గ్రహాలపై కూడా మనగలుగుతుందట. అందువల్ల వ్యోమగాములకు అంతరిక్షంలో ఉన్నప్పటికీ ఆక్సిజన్, పోషకాలు అందించడంలో సహాయపడుతుంది. కొన్ని గ్రహాలపై అగ్రికల్చరింగ్ ప్రాసెస్ ద్వారా ఈ మొక్కలను పెంచవచ్చు.

వాస్తవానికి వాటర్‌ మీల్ అనే పుష్పించే మొక్క డక్‌వీడ్ కంటే కూడా చిన్నది. ఇది థాయిలాండ్, అలాగే వివిధ ఆసియా ప్రాంతాలలోని జలాశయాల్లో నీటిపై తేలియాడుతూ కనిపిస్తుంది. దీనికి వేర్లు, కాండం ఉండవు. దాని సరళమైన నిర్మాణం, వేగవంతమైన వృద్ధి రేటు మారుతున్న గురుత్వాకర్షణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు నెదర్లాండ్స్‌లోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన టెక్నికల్ సెంటర్‌లో పరిశోధనలు నిర్వహించారు. లార్జ్ డయామీటర్ సెంట్రిఫ్యూజ్ (LDC)ని ఉపయోగించి వాటర్ మీల్ మొక్క హైపర్‌గ్రావిటీ పరిస్థితులకు ఎలా వర్తిస్తుందో స్టడీ చేశారు. ఎందుకంటే ఈ మొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను సమృద్ధిగా ఉత్పత్తి చేస్తుంది. పైగా ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. థాయ్‌లాండ్‌ ప్రజలు తరతరాలుగా స్థానిక ఆహారంలో భాగంగా, సూప్‌ల నుంచి సలాడ్‌ల వరకు వంటలలో ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు.

అయితే అంతరిక్షంలో హైపర్‌గ్రావిటీ పరిస్థితుల్లో వాటర్‌మీల్‌ ప్రభావాన్ని పరిశోధించడానికి రీసెర్చర్స్ సహజ సూర్యరశ్మిని ప్రతిబింబించేలా LED లైటింగ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన బాక్సెస్ నమూనాల్లో దానిని ఉంచారు. ఈ సందర్భంగా వాటర్ మీల్ మొక్క బాక్సెస్ లోపల లార్జ్ డయామీటర్ సెంట్రిఫ్యూజ్ లోపల భూమి యొక్క గురుత్వాకర్షణను 20 రెట్లు అనుకరిస్తూ, హైపర్ గ్రావిటీ పరిస్థితులకు లోబడి ఉన్నట్టు సైంటిస్టులు కనుగొన్నారు. దీంతో తమ పరిశోధన స్పేస్ అగ్రికల్చర్‌ను ముందుకు తీసుకెళ్లే వాగ్దానాన్ని అందిస్తుందని వెల్లడించారు. వాటర్ మీల్ మొక్కను అంతరిక్ష వాతావరణ పరిస్థితుల్లో పెంచవచ్చని తెలిపారు.