బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ (షారూక్ ఖాన్) నటించిన రెండు సినిమాలు(‘జవాన్’, ‘పఠాన్’) భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించాయి. వీటి తర్వాత షారుక్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపేస్తామంటూ ముంబయిలోని ఆయన నివాసం మన్నత్‌కు పలు లేఖలు వచ్చాయి. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు.
తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్ దృష్ట్యా మరింత భద్రత కల్పించాలని షారుక్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. షారుక్‌కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. దాన్ని వై-ప్లస్ కేటగిరిగా మారుస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించారు. వారు మూడు షిప్టుల్లో ఆయనకు భద్రత కల్పించనున్నారు. ఇక మరోవైపు కొందరు వ్యక్తులు షారుక్ ఫొటోలను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈ ఏడాది షారుక్ నటించిన రెండు సినిమాలను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుక్ సతీమణి గౌరీఖాన్ నిర్మించారు. ‘పఠాన్’ (పఠాన్) రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అలాగే తాజాగా వచ్చిన ‘జవాన్’ (జవాన్) ఇప్పటి వరకు రూ.1100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం విడుదలై నెల గడుస్తున్నా ఇంకా పలుచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం విశేషం.