ScienceAndTech

సిటీలో మొట్టమొదటి ‘టీ’ ఏటీఎమ్ ప్రారంభం!

సిటీలో మొట్టమొదటి ‘టీ’ ఏటీఎమ్  ప్రారంభం!

నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్‌ ఎల్‌పీటీ మార్కెట్‌ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్‌ ఓపెన్‌క్యూబ్‌ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్‌ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు.

ఈ సందర్భంగా జెమ్‌ ఓపెన్‌క్యూబ్‌ సీఈఓ పి.వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్‌లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్‌ టీ, బాదం పాలు, బిస్కెట్‌లతో సహా మంచి నీటి బాటిల్‌లను అందించే ‘డిజిటల్‌ చాయ్‌’ లేదా ‘చాయ్‌ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్‌లోకి విడుదల చేశామన్నారు. జెమ్‌ ఓపెన్‌క్యూబ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటేష్‌ యాదవ్, ప్రకాష్‌ వేలుపుల, త్రిలోచన్‌ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.