పాఠశాలకు రాలేదన్న కారణంతో విద్యార్థిని ప్రధానోపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన లాల్‌దర్వాజాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌దర్వాజాకు జె.బిందు కుమార్తె వైష్ణవి(12) వెంకట్రావు స్మారకోన్నత పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది. జులైలో బాలిక తండ్రి ఈశ్వర్ మృతితో తీవ్ర మనస్తాపానికి గురై.. అప్పటినుంచి బడికి వెళ్లలేదు. తల్లి, బంధువులు నచ్చజెప్పడంతో 4న వెళ్లింది. మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ప్రధానోపాధ్యాయ రేణు.. వైష్ణవిని గమనించి, తన వద్దకు తీసుకెళ్లి పాఠశాలకు ఎందుకు రాలేదని విపరీతంగా కొట్టింది. తండ్రి మరణించాడని చెప్పినా వినిపించుకోకుండా విచక్షణారహితంగా బెత్తంతో కొట్టడంతో బాలిక శరీరంపై వాతలు తేలాయి. ఇంటికి వచ్చిన తరువాత బాలిక నొప్పులతో బాధపడుతూ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో సైతం బాలిక ఒంటిపై దెబ్బలు చూపడంతో బాలిక తల్లి బిందు ఆదివారం మొఘల్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మొఘల్‌పుర ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.